Temparatures : భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. చలిగాలికి చిత్తవుతున్న జనజీవనం
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలిగాలులు చంపేస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలిగాలులు చంపేస్తున్నాయి. గడ్డకట్టుకుపోయేటంత చలి ఉండటంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా డిసెంబరు నెల నుంచే చలిగాలులు ఎక్కువగా వీస్తుంటాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చలిగాలుల తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న కాలంలో చలి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు మరింత తగ్గితే ప్రజలు రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగానే మారనుంది. ఇప్పటికే అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు.
బయటకు రావాలంటే...
సాయంత్రం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ చలి తీవ్రత తగ్గడం లేదు. చలి పులి చంపేస్తుంటే బయటకు రాలేకపోయినా ఇంట్లో గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీప్రాంతాలయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట చలి మరింత ఎక్కువగా ఉంది. ప్రజలు చలి నుంచి కాపాడుకోవాడానికి చలి మంటలతో కొంత ఉపశమనం పొందుతున్నారు. రాత్రి వేళ కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రజాయ్ ను వదిలి బయటకు వచ్చేందుకు బయకు రావడం లేదు. నిజానికి స్నానం చేయాలన్నా భయమేసేటంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ప్రజలు అనేక రకాలైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లోని మినుములూరులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ చలి దెబ్బకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలోనూ అంతే. ఆదిలాబాద్, నిజామాబాద్,మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ లోని మౌలాలి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాల్లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో అనేక ప్రాంతాల్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయింది. దీనికి తోడు పొగమంచుతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇంత స్వల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.