Rain Alert : పాడు వర్షం ఏపీని వదిలిపెట్టడం లేదుగా

అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-12-16 03:41 GMT

దక్షిణ భారత దేశంలో ఉన్న తీర ప్రాంత ప్రజలు నిత్యం తుపానులు, అల్పపీడనాలతో ఇబ్బందిపడుతూనే ఉన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఎంత ఎండనయినా భరించవచ్చేమో కానీ, వర్షాన్ని మాత్రం ఇష్టపడని జనం గత కొద్ది రోజులుగా వరసగా కురుస్తున్న వర్షాలకు అనేక రకాలుగా చితికి పోతున్నారు. వర్షం అంటే ఒకప్పుడు సీజన్ లో పడేది. కానీ ఇప్పుడు అలా కాదు. తరచూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత పదిహేను రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనూ, తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తుండటం ఆ ప్రాంత ప్రజలను చికాకు పెడుతుంది.

నలభై ఎనిమిది గంటల్లో...
తాజాగా దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో అనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కేవలం భారీ వర్షంతో సరిపెట్టకుండా ఈదురుగాలులు కూడా బలంగా వీచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అదే సమయంలో తీర ప్రాంతంలోనూ ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరించారు.
రహదారుల్లో నీరు నిండి...
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు గాను, మరికొన్ని చోట్ల చిరు జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతాల్లో వర్షం కురవడంతో పంట నష్టం కూడా తీవ్రంగానే జరిగింది. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకోలేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ టార్పాలిన్ వంటి వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించినా పాడు వర్షం మాత్రం వదిలిపెట్డడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో రాకపోకలపై వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. రహదారులు వర్షానికి మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రభుత్వానికి ఇది అదనపు భారంగా మారింది.


Tags:    

Similar News