Ys Jagan : తిరుమలలో నేడు ఏం జరుగబోతుంది? జగన్ ను అడ్డుకుంటారా?
నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లేందుకు తిరుపతికి రానున్నారు. ఆయన రేపు స్వామి వారిని దర్శించుకుంటారు
నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లేందుకు తిరుపతికి రానున్నారు. ఆయన రేపు స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే జగన్ తిరుమల పర్యటన మాత్రం టెన్షన్‌ల మధ్య కొనసాగుతుంది. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. డిక్లరేషన్ ను అలిపిరి వద్దనే సమర్పించి వెళ్లాలంటూ బీజేపీ నేతలు ఈవో శ్యామలరావుకు విజ్ఞప్తి చేశారు. కూటమిలోని మూడు పార్టీలతో పాటు హిందూ ధార్మిక సంఘాలన్నీ కలసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని జగన్ తిరుమల పర్యటనపై చర్చించారు. దీనిని అడ్డుకునేందుకు అవసరమైన వ్యూహాలను రచించినట్లు తెలిసింది. తొలుత కాలినడకన వెళ్లాలని అనుకున్న జగన్ తర్వాత పర్యటనలో మార్పులు చేసినట్లు తెలిసింది. ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు చేరుతారని చెబుతున్నారు.
డిక్లరేషన్ ఇవ్వాల్సిందే...
జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళితే తమకు ఏం ఇబ్బంది లేదని, కానీ అన్యమతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధన అని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీలు కూడా తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారన్న విషయాన్ని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని వారు కోరుతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఈ నిబంధనను బుల్‌డోజ్ చేసి స్వామి వారిని దర్శించుకున్నారని, ఇప్పుడు కుదరదని కూటమి నేతలు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి హోదాలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినందున డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నారు.
వెళ్లి తీరతారంటున్న...
ఈ నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగే అవకాశముంది. అటు వైసీపీ నేతలు కూడా జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారని చెబుతున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని వాడారంటూ చంద్రబాబు మహాపచారానికి పాల్పడ్డారని, మహా అబద్ధానికి తెరతీశారని, అందుకోసమే ప్రత్యేకంగా జగన్ తిరుమల దర్శనానికి వస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. స్వామి వారిని ఆయన సమక్షంలోనే మనసులో ప్రార్థిస్తారని చెబుతున్నారు. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
రేపు ఆలయాల్లో పూజలు...
మరో వైపు శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో రేపు అన్ని దేవాలయాల్లో పూజలను వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇటు జగన్ తిరుమల పర్యటన, అటు దేవాలయాల్లో పూజలతో ఆంధ్రప్రదేశ్ నేడు, రేపు కొంత ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఆలయాల్లో రాజకీయ పార్టీ కార్యకర్తల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాస్థాయిలో ఎస్పీలు ఈ పూజలపై మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం మీద తిరుమల లడ్డూ వివాదం ఏపీలో ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.