Rk Roja : రోజా మళ్లీ లైన్ లోకి వచ్చారా? అందుకేనటగా?

మాజీ మంత్రి ఆర్కే రోజా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు

Update: 2024-09-06 08:31 GMT

మాజీ మంత్రి ఆర్కే రోజా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారు. ఆమె ఎక్కువగా చెన్నైలోనో, లేక కుటుంబ సభ్యులతో కలసి విదేశాల్లోనూ పర్యటిస్తూ కాలం గడిపేవారు. పుణ‌్య క్షేత్రాలను దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. దాదాపు వంద రోజుల నుంచి ఆమె విజయవాడ వైపు కూడా రాలేదు. పార్టీ అధినేత జగన్ ను వచ్చి కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఆర్కే రోజాపై అనేక రకమైన ప్రచారం జరిగింది. ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి వెళుతున్నారని, హీరో విజయ్ పెడుతున్న పార్టీలో చేరి తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరిగింది.

రాష్ట్ర రాజకీయాలకు...
అందుకు తగిన విధంగానే ఆర్కే రోజా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండటంతో నిజమేనని నమ్మిన వాళ్లుచాలా మంది ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్కే రోజాకు మంచి ప్రయారిటీ ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వకముందు నామినేటెడ్ పదవి ఇచ్చారు. అదే సమయంలో మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు చోటు కల్పించి చిత్తూరు జిల్లా నుంచి ప్రత్యేక ప్రాధాన్యత ఆర్కే రోజాకు ఉందని జగన్ పార్టీ నేతలకు చెప్పకనే చెప్పారు. చిత్తూరు జిల్లాలో చాలా మంది ఆర్కే రోజాకు వ్యతిరేకమయినా జగన్ వారెవ్వరినీ లెక్క చేయకుండా మంత్రిపదవి ఇవ్వడంతో ఆమె మరింత రెచ్చిపోయారు. తన సొంత నియోజకవర్గంలోని నగరిలోనూ వైసీపీ నేతలను దూరం చేసుకున్నారు.
రోజా శత్రువులను కూడా...
చివరకు ఎన్నికల సమయంలో అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను జగన్ మార్చారు. ఐ ప్యాక్ టీం ఇచ్చిన నివేదికలను అనుసరించి అభ్యర్థులను మార్చారు. కొందరిని మరొక నియోజకవర్గాలకు పంపించి వేశారు. రోజాను కూడా నగరి నుంచి మారుస్తారన్న ప్రచారం జరిగింది. అయితే జగన్ మాత్రం చివరకు ఆర్కే రోజాకు నగరి టిక్కెట్ ను ఖరారు చేశారు. దీంతో ఆమె ఖుషీ అయ్యారు. ఆఖరుకు రోజా కు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నేతలతో జగన్ స్వయంగా మాట్లాడి రోజా గెలుపునకు సహకరించాలని కోరారు. కానీ రాష్ట్రంలో కూటమి గాలి బలమైన గాలులు వీయడంతో ఆర్కే రోజా కూడా దారుణంగా గాలి భానుప్రకాష్ చేతిలో ఓటమి పాలయ్యారు.
చాలా రోజులకు...
అయితే ఆర్కే రోజా ఇప్పటి వరకూ జరిగిన ప్రచారానికి తెర దింపారు. తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని నిలదీశారు. ఇక విజయవాడ వరదల్లో ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా షో చేయడం తప్ప బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నం చేయడం లేదని అన్నారు. ముందుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. మొత్తం మీద ఆర్కే రోజా రాజకీయంగా యాక్టివ్ కావడం పట్ల క్యాడర్ లో సంతోషం కనపడుతుంది.



Tags:    

Similar News