Andhra Pradesh : పింఛన్ల పంపిణీకి అంతా సిద్ధం.. నిధులు విడుదల
ఆగస్టు 1వ తేదీ ఉదయం నుంచి రాష్ట్రంలో పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్టు 1వ తేదీ ఉదయం నుంచి రాష్ట్రంలో పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ఉత్తర్వులు అందాయి. గ్రామ సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియను చేపట్టాలని పేర్కొంది. ఒక్కొక్కరికి పెంచిన విధంగా నాలుగు వేల రూపాయల చొప్పున పింఛనును రేపు పంపిణీ చేయనున్నారు. అయితే పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని చంద్రబాబు ఆదేవించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి 2,737 కోట్ల ను ప్రభుత్వం ముందుగానే విడుదల చేసింది.
ఉదయం నుంచే...
రాష్ట్రంలో ఉన్న 64.82 లక్షల మందికి రేపు ఉదయం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీని రేపటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరొక రోజు తీసుకోవాలని, అంతే తప్ప పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం చేయవద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం వృద్ధులకు ఎన్టీఆర్ ఆసరా పింఛను కింద నాలుగు వేలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలోని గుండుమలలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛనును అందచేయనున్నారు. రేపు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పూజలు కూడా నిర్వహించనున్నారు.