Andhra Pradesh : ఏపీలో కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి అంటే?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత తొలిసారి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు

Update: 2024-12-05 06:05 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత తొలిసారి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తొలుత డిసెంబరు 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు రేషన్ కార్డు కోసం సచివాలయాలకు వచ్చి ఆరా తీస్తున్నారు.కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అనేక మంది రేషన్ కార్డులను పొందేందుకు ప్రయత్నించినా ఇప్పటి వరకూ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈసారి రేషన్ కార్డులకు గిరాకీ బాగా పెరిగిందని చెబుతున్నారు. అందుకే రేషన్ కార్డులను పొందడానికి సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు.

ప్రచారం జరిగినా...
డిసెంబరు 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వారు సమీపంలో వార్డు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ప్రచారం మాత్రం ఆధార్ కార్డుతో పాటు, ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్ ను కూడా సమర్పించాల్సి ఉంటుందని కూడా జరిగింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు మాత్రమే కొత్తగా రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. నిజానికి రేషన్ కార్డు లేనిదే ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకం దరి చేరదు. అందుకే రేషన్ కార్డుకోసం అంత డిమాండ్ ఏర్పడింది. రేషన్ కార్డు తో బియ్యం తీసుకోకపోయినా పథకాలు అందుకోవడానికి సులువవుతుందని భావించి క్యూ కడుతున్నారు. దీపం 2 పథకం కింద కూడా రేషన్ కార్డు ఆధారంగానే ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు అందచేస్తున్నారు.
సంక్రాంతి నాటికి?
అందిన దరఖాస్తులన్నింటినీ అధికారులు పరిశీలించిన తర్వాత సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు అధికారులు మంజూరు చేసే అవకాశముందన్న ప్రచారం లో నిజం లేదని కొందరు అధికారులు చెబుతన్నారు. మార్చి నెల అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఎప్పుడు దరఖాస్తులు తీసుకున్నా లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ప్రదర్శించనున్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవచ్చని అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నివాసముండే నిరుపేదలందరూ రేషన్ కార్డు పొందడానికి అర్హులే. అందులో తెలుపు రంగు రేషన్ కార్డు వస్తే ఆరోగ్య శ్రీ వంటి పథకాలు కూడా అమలవుతాయి. కొత్తగా పెళ్లయిన వారికి ఈ రేషన్ కార్డులు ఉపయోగపడతాయి. కేవలం గ్రామ, వార్డు సచివాలయంలో మాత్రమే కాకుండా సివిల్ సప్లయిస్ అధికారిక వెబ్ సైట్ లో కూడా దరఖాస్తుకు వీలుంది. ప్రస్తుతం 1.65 కోట్ల తెలుపు రంగు రేషన్ కార్డులున్నాయి. మరో లక్షన్నర కొత్త రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉంది. ఆధార్ కార్డుతో పాటు దరఖాస్తును నింపి సచివాలయంలో ఇస్తే వాటిని పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు కొత్తవి మంజూరు చేయనున్నారు. మరి రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునేది ఎప్పటి నుంచి అన్నదానిపై మాత్రం క్లారిటీ ఇంకా ఇవ్వలేదు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News