విద్యార్థులకు అలర్ట్.. ఒంటిపూట బడులు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల్లో పురోగతి ఉంటుందని ఐఎండీ భావిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో
జూన్ నెల అయిపోతున్నా కూడా ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో పిల్లలు బడికి వెళ్లాలంటే భయపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు మరో వారం పొడిగించింది. ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 12న రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ, ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17 వరకు ఒంటిపూట బడులు జరపాలని నిర్ణయించారు. ఎండలు తగ్గకపోవడంతో మరికొన్ని రోజులు పొడిగించారు. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాల్లో పురోగతి ఉంటుందని ఐఎండీ భావిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. రాజస్థాన్‌లో కొనసాగుతున్న వాయుగుండం పూర్తిగా బలహీనమయ్యే వరకు దక్షిణాదిలో నైరుతి రుతుపవనాలు బలపడవని అంటున్నారు. ఈ నెల 25 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడి ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉంది. అప్పుడు ఉత్తర కోస్తాకు రుతుపవనాలు వస్తాయంటున్నారు. ఆదివారం రాష్ట్రంలోని 217 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 145 మండలాల్లో గాడ్పులు వీచాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 46 డిగ్రీలు నమోదైంది. కాకినాడ జిల్లా చేబ్రోలులో 45.9°, మన్యం జిల్లా సాలూరు, శ్రీకాకుళం జిల్లా పొందూరులో 45.7, తూర్పుగోదావరి జిల్లా నందరాడలో 45.4, ప్రకాశం జిల్లా పచ్చవలో 45.3 అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సోమవారం 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 330 మండలాల్లో వడగాల్పులు.. మంగళవారం 16 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 264 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా బీఆర్ అంబేద్కర్ తెలిపారు.