Tirumala : తిరుమలలో నేడు పెరిగిన భక్తుల రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగింది. దీపావళి రోజున ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వచ్చారు

Update: 2024-10-31 03:18 GMT

Tirumala Darshan

తిరుమలలో ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగింది. దీపావళి రోజున ఎక్కువ మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చారు. గత కొద్దిరోజుల నుంచి తిరుమలకు భక్తుల రాక తగ్గిపోయింది. ఆదాయం కూడా అనుకున్నంత స్థాయిలో రాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దీపావళి నుంచి తిరిగి రద్దీ ప్రారంభమవుతుందని అంచనా వేశారు. దీపావళికి వరస సెలవు దినాలు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. తిరుమల వీధులన్నీ భక్తులతో కళకళలాడిపోతున్నాయి. ఎక్కడ చూసినా భక్తుల సందడి నెలకొంది. నిన్నటి వరకూ బోసిగా ఉన్న కంపార్ట్‌మెంట్లన్నీ నేడు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. తిరుమలలో దీపావళి ఆస్థాన వేడుకలను చూసేందుకు జనం బారులు తీరారు. దీపావళి ఆస్థాన వేడుకలకు సంబంధించి తిరుమలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమలకు భక్తుల చేరికతో సందడిగా మారింది.

పది కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం జరగనుంది. దీంతో ఆర్జిత సేవలను రద్దు చేశారు. దీంతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేసింది. మామూలు దర్శనాలు మాత్రం యధాతధంగా ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. దీపావళి రోజు స్వామి వారిని దర్శించుకుంటే మంచిదన్న కారణంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటలకు పైగానే పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 55,219 మంది భక్తులు దర్శించకున్నారు. వీరిలో 16,211 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.37 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News