Andrha Pradesh : ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం.. బి అలెర్ట్ అంటున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి ఈ నెల 17వ తేదీన తీరం దాటనుంది;
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి ఈ నెల 17వ తేదీన తీరం దాటనుంది. ఎల్లుండి కొన్ని జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు. అయితే నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఇప్పటికే ఆ జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేశారు.
ఫ్లాష్ ఫ్లడ్ అంటే...
ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఆకస్మిక వరదలు సంభవించడం. లోతట్టు ప్రాంతాలను వేగంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్ ముంచేస్తుంది. నదులు ఉప్పొంగుతాయి. తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షంపడుతుంది. భారీ వర్ష పాతం నమోదయ్యే అవకాశముంది. ఒక విధంగా క్లౌడ్ బరస్ట్ లాంటిదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ వర్షం పడి నదులు ఉప్పొంగి గ్రామాలు, పట్టణాలు మునిగి పోయేఅవకాశముంది. అందుకే ఫ్లాష్ ఫ్లడ్ అంటేనే భయపడిపోతారు. అధికారులు, సిబ్బంది కూడా ఏమీచేయలేని పరిస్థితి ఉంటుంది. సకాలంలో ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతు్నారు.
ముందస్తు చర్యలతో...
మరోవైపు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లను, ట్యాంకర్లను తెప్పించారు. భారీ వర్షాల సమయంలో విద్యుత్తు సౌకర్యం నిలిపివేయనున్నారు. ఈదురుగాలులు వీయనుండటంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్లను తెప్పించారు. అలాగే అన్ని రకాలుగా ఆహార పొట్లాలను, మంచినీటి ప్యాకెట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతో ఎల్లుండి ఏదో జరగబోతుందన్న అనుమానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకుంటోంది.