Rain Alert : ఏపీకి హై అలెర్ట్... మరోసారి భారీ వర్షాలు కురిసే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీలంక, తమిళనాడు, కేరళ వైపు పయనించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండంగా...
ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రధానంగా కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.
ఈదురుగాలులతో కూడిన...
ప్రధానంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గంటలకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఈ నెల 27,28 తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. అందుకే రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, అదే సమయంలో వాగులు, వంకలు దాటే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.