మహానాడుకి 1700 మంది పోలీసులు
తొలిరోజు 30-40 వేల మంది వరకూ వస్తారని అంచనా. 50 వేలమందికి సరిపడా నోరూరించే వంటకాలు, త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను..
స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి రోజున టీడీపీ ప్రతి ఏటా మహానాడు నిర్వహిస్తోంది. ఈ ఏడాది 34వ మహానాడు కార్యక్రమానికి రాజమహేంద్రవరం వేదికైంది. నేడు, రేపు రాజమండ్రి శివార్లలోని వేమగిరి వద్ద 55 ఏకరాల విశాల మైదానంలో పసుపు పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాు. ఈ మహానాడు ప్రాంగణానికి ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టారు. ఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం కూడా కావడంతో.. రాజమండ్రిలో జరిగే మహానాడుకు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది.
నేడు ప్రతినిధుల సమావేశం జరగనుంది. రేపు లక్షలాది ప్రజల సమక్షంలో మహానాడు వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల్లో 15 మంది పార్టీ ప్రతినిధులను టీడీపీ ప్రత్యక్షంగా ఆహ్వానించింది. తొలిరోజు 30-40 వేల మంది వరకూ వస్తారని అంచనా. 50 వేలమందికి సరిపడా నోరూరించే వంటకాలు, త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. మహానాడు సందర్భంగా రాజమండ్రి పసుపు రంగును పులుపుముకుంది. పార్టీ అధినేత చంద్రబాబు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పిస్తారు. అనంతరం ప్రతినిధుల రిజిస్టర్ లో సంతకం చేస్తారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, మహానాడును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి పలు అంశాలపై తీర్మానాలు చేస్తారు.
కాగా.. మహానాడు ప్రాంగణం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ఉండేందుకు 1700 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా దారి మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలను గుండుగొలను వద్ద, వైజాగ్ నుంచి వచ్చే వాహనాలను కత్తిపూడి వద్ద మళ్లించేలా చర్యలు తీసుకున్నారు.