TDP Aliance : పదేళ్ల తర్వాత ఒకే వేదిక పైకి...విడిపోయి.. మళ్లీ కలిసి.. నేడు
ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ల క్రితం సీన్ రిపీట్ కానుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఒకే వేదికపై కన్పించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ల క్రితం సీన్ రిపీట్ కానుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఒకే వేదికపై కన్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ‌్‌లు ఒకే వేదికపై 2014 తర్వాత తిరిగి 2024 ఎన్నికల్లో కన్పిస్తుండటం విశేషం. గత ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ బీజేపీని వ్యతిరేకించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ ఆ పార్టీపై ఫైర్ అయ్యారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్యాకేజీపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ‌్ 2019 ఎన్నికల తర్వాత తిరిగి ఎన్డీఏలో చేరి నేడు మోదీ సభలో ఏపీలో పాల్గొంటున్నారు.
నాడు విభేదించి...
చంద్రబాబు కూడా అంతే. 2014లో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ రెండు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా మారాయి. అయితే 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. కేంద్ర మంత్రివర్గం నుంచి తొలిగింది. ధర్మపోరాటం పేరిట దేశ వ్యాప్తంగా సభలను పెట్టి మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా ఉద్యమించింది. 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టు కట్టారు కూడా. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత చంద్రబాబు తిరిగి ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ సహకారాన్ని ఆయన గట్టిగా కోరుకున్నారు. అయితే ఇటీవల బీజేపీ టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించింది.
నేడు కలసి...
దీంతో రానున్న ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలసి పోటీ చేస్తున్నాయి. సీట్ల ఒప్పందం కూడా కుదిరింది. అయితే ఈరోజు చిలకలూరిపేట సమీపంలోకి బొప్పూడి వద్ద భారీ బహిరంగ సభలో ముగ్గురు నేతలు పాల్గొననున్నారు. ఈ సభకు ప్రజాగళంగా నామకరణం చేశారు. మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సభకు పది లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ సభ ద్వారా ముగ్గురు నేతలు కలసి తమను మరొకసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరనున్నారు. ఇప్పటికే బొప్పూడి వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ ప్రాంగణాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తన అధీనంలోకి తీసుకుంది. ఈ సభ ద్వారా మోదీ చేసే ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.