Pithapuram : పిఠాపురంలో టీడీపీ Vs జనసేన ... వందరోజుల్లోపే ఎందుకిలా?

పిఠాపురంలో వంద రోజుల్లోనే రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. జనసేన, టీడీపీ క్యాడర్ మధ్య వార్ నడుస్తుంది

Update: 2024-09-05 08:24 GMT

పిఠాపురంలో వంద రోజుల్లోనే రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. జనసేన, టీడీపీ క్యాడర్ మధ్య నువ్వా? నేనా అన్నట్లుంది వ్యవహారం. ఒకరకంగా టీడీపీని జనసేన స్థానిక నేతలు దూరం పెడుతుంటే, ఇటు టీడీపీ నేతలు కూడా జనసేన లోకల్ లీడర్స్ ను ఇప్పటికే బాయ్ కాట్ చేశారు. అధికారంలోకి కూటమి వచ్చి వంద రోజులు కాకముందే పిఠాపరంలో టీడీపీ, జనసేన ఫైట్ పీక్స్ కు చేరింది. అధినాయకత్వం మాత్రం బాగానే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో మాత్రం నేతలు రెండు చీలిపోయారు. మాజీ ఎమ్మెల్యే వర్మను జనసైనికులు దూరం పెడుతుండగగా, ఇందుకు టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

రాష్ట్ర స్థాయిలో మాత్రం...
రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోడి సజావుగానే ఉంది. ఇద్దరూ సమన్వయంతో పనిచేసుకుంటూ వెళుతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా పవన్ కల్యాణ్ కు పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఆయనను దూరం చేసుకునే ఏ చిన్న పనిని కూడా చంద్రబాబు చేయడం లేదు. అన్నింటా పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా అదేస్థాయిలో చంద్రబాబుకు గౌరవం ఇస్తున్నారు. ఆయన మీద వైసీపీ విమర్శలు చేసినా జనసేనాని ఊరుకోవడం లేదు. ఇద్దరు అగ్రనేతలు ఆ స్థాయిలో ఉంటే పిఠాపురంలో మాత్రం పరిస్థితి మాత్రం తేడాగా ఉంది.
పవన్ అందుబాటులో లేక...
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఎక్కువగా ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలను మాజీ ఎమ్మెల్యేగా వర్మ పట్టించుకుంటున్నారు. మరి పవన్ కల్యాణ్ ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించారే ఏమో? తెలియదు కాని.. అధికారుల వద్దకు వెళ్లడం కాని, పనులు చేయడం వంటివి మాజీ ఎమ్మెల్యే వర్మ చూసుకుంటున్నారు. గతంలో తాను ఎమ్మెల్యే కావడంతో తనకు పరిచయమున్న అధికారులతో పనులు చేయిస్తున్నారు. అయితే దీనిని జనసైనికులు అడ్డుపడుతున్నారు. ఎమ్మెల్యే తమ పార్టీకి చెందిన వారని, టీడీపీ నేతల మాటలు ఎలా వింటారంటూ అధికారులపై వత్తిడి తెస్తున్నారు. దీంతో అధికారులు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
మరింత పెరిగిన గ్యాప్...
మరోవైపు జనసేన పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమాలకు, చివరకు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా వర్మను పిలవకపోవడంతో ఆయన అనుచరుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. పొత్తులో భాగంగా తనసీటును త్యాగం చేసిన వర్మకు ఇలాంటి గౌరవిమిస్తారా? అంటూ నేరుగా మండిపడుతున్నారు. వర్మ కూడా జనసేన నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అసలు ఎన్నికల సమయం నుంచే కొంత గ్యాప్ ఉంది. అది అధికారంలోకి రాగానే మరింత పెరిగింది. ఇప్పుడు ఇంకా రెండు పార్టీల క్యాడర్ దూరమయినట్లే కనిపిస్తున్నాయి. పిఠాపురం విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్యకు చెక్ పడే అవకాశం లేదు.


Tags:    

Similar News