Rain Alert : ఏపీకి దూసుకొస్తున్న తుపాన్... దుమ్ము రేపుతుందా?
నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు నుంచి 13వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
మత్స్యకారులు చేపలవేటకు....
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వర్షాలు పడుతున్నాయి. వరికోతలు సమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి మళ్లీ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలపడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా తిరిగి తీరప్రాంతానికి చేరుకోవాలని సూచనలు జారీ చేసింది. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశమున్నందున పొలాల్లో పనిచేసేవారు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రయాణాలు రద్దు చేసుకుంటే...
అదే సమయంలో వాగులు, వంకలు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కూడా కోరింది. అల్పపీడన ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఈ ప్రాంతంలోని ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. మరోవైపు ప్రాజెక్టుల వద్ద నీటిపారుదల శాఖ అధికారులను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రాజెక్టుల వద్ద నీటి ఉధృతి పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తూ అవసరమైన సూచనలు ప్రభుత్వానికి అందచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోసారి ఏపీకి అల్పపీడన ప్రభావంతో ఈరోజు నుంచి భారీ వర్షాలు పడే అకాశం ఉంది.