Andhra Pradesh : ఈవీఎంలను ఆడిపోసుకోవడంలో అర్థముందా?

ఓటమి చెందిన వెంటనే ఈవీఎంలను తప్పుపట్టడం చంద్రబాబు, జగన్ లకు అలవాటుగా మారింది

Update: 2024-10-10 08:34 GMT

 chandrababu and ys jagan

ఓటమి చెందితే కాని ఈవీఎంలలో తేడా ఉన్నట్లు అర్థం కాదా? ఖచ్చితంగా తాము గెలుస్తామని భావించి ఓటమి పాలయితే దానిని ప్రజాభిప్రాయం కింద పరిగణనలోకి తీసుకోవడం లేదు మన నేతాశ్రీలు. గెలిస్తే అది మన వల్లనే అని జబ్బలు చరుచుకుంటారు. లేదంటే అవతలి వారిపై అసంతృప్తి అని చెబుతారు. అదే గెలవకుంటే మాత్రం అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించరు. నాడు చంద్రబాబు నాయుడు, నేడు వైఎస్ జగన్ ది అదే పరిస్థితి. ఎందుకంటే వారు గెలుపోటములను వెంటనే తీసుకోరు. ఆ తప్పిదాన్ని ఈవీఎంలపై నెట్టి తాము చేసిన తప్పులను మాత్రం ప్రజల దృష్ఠి నుంచి మరల్చేందుకు ఎక్కువ సార్లు కామెంట్స్ చేస్తుంటారు.

నాడు చంద్రబాబు కూడా...
మీకు గుర్తుండే ఉంటుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమయింది. నిజానికి ఇంత తక్కువ స్థానాలు టీడీపీ చరిత్రలోనే రాలేదు. ఎన్నికలకు ముందు పసుపుకుంకుమలు ఇచ్చామనుకున్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను పరుగులు పెట్టించామని భావించారు. కానీ ఓడిపోవడంతో చంద్రబాబు ఈవీఎంలను తప్పు పట్టారు. నాడు చంద్రబాబు ఒంటరిగా పోటీ చేశారు. పవన్ కల్యాణ్, బీజేపీలు వేర్వేరుగా బరిలో ఉన్నారు. కానీ జగన్ కు ఒకసారి ఇవ్వాలని భావించిన ప్రజలు ఫ్యాన్ పార్టీకే పట్టం కట్టారు. 151 స్థానాలను చరిత్రలో తొలిసారి ఒక పార్టీకి కట్టబెట్టి ఏకపక్ష తీర్పు చెప్పారు. దీంతో ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయి ఈవీఎంలలో ఏదో తేడా ఉందన్నారు. టీడీపీ సోషల్ మీడియా కూడా అదే తరహా ప్రచారం చేసింది.
జగన్ ఇప్పుడు...
కట్ చేస్తే.. 2024 ఎన్నికలు ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే రాగం మొదలు పెట్టారు. వైసీపీకి మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో వైఎస్ జగన్ నింద ఈవీఎంలపై నెట్టేశారు. ముందస్తు, ఎన్నికల అనంతరం సర్వేలు కూడా తమకు అనుకూలంగా వస్తే తాము ఎలా ఓడిపోగలమని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఈవీఎంలు కారణం అంటూ ఆ పార్టీ చేస్తున్న వాదనకు జగన్ కూడా మద్దతుగా నిలిచారు. బ్యాలట్ విధానమే మంచిదని అన్నారు. ప్రజాభిప్రాయం ప్రతిబింబించాలంటే ఇతర దేశాల మాదిరిగా బ్యాలెట్ పేపర్లను వినియోగించాలన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ...
ఇరువురు నేతలు ఒకసారి ఓడి మరొకసారి గెలిచిన వాళ్లే. ఇద్దరూ ప్రాంతీయ పార్టీలకు చీఫ్‌లే. నాడు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయని కితాబిచ్చిన నేతలు ఓటమి తర్వాత మాత్రం అవి మంచివి కావంటున్నారు. నిజానికి ఇద్దరూ తాము చేసిన స్వయంకృతాపరాధం వల్లనే ఓటమి పాలయ్యారు. అవతలి వారు గెలిచారు. అంత మాత్రాన ఎన్నికల కమిషన్ పై బురద జల్లడం ఎంత వరకూ సబబన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ దే. ఎందుకంటే నెపం నెట్టింది ఈవీఎంలపైనేనా? ప్రజల దృష్టిలో దోషిగా మిగిలేది ఎన్నికల కమిషనే కావడం గమనార్హం. అందుకే ఈసీ ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రతి ఎన్నకకూ ఈవీఎం ఒక బూచిగా మారుతూనే ఉంటుంది.
Tags:    

Similar News