Pawan Kalyan : ఉట్టికెగరేలేన్నమ్మ.. స్వర్గానికి ఎగురుతానన్నట్లుందిగా జానీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడులో పార్టీని విస్తరిస్తామని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది;

Update: 2025-03-26 06:37 GMT
pawan kalyan, jana sena, expand, tamil nadu
  • whatsapp icon

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడులో పార్టీని విస్తరిస్తామని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు పవన్ కల్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేశారన్నది రాజకీయంగా చర్చనీయాంశమైంది. డీఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో డీ లిమిటేషన్, భాష మనుగడ సమస్యపై దక్షిణాది రాష్ట్రాల నేతలను ఏకం చేసే ప్రయత్నంలోనే పవన్ కల్యాణ్ ను కూడా తమిళనాడులోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. తమిళనాడులో పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఇటీవల పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ సభలోనూ ఆయన తమిళంలో ప్రసంగించారు. తనకు తమిళనాడుతో సత్సంబంధాలున్నాయని తెలిపారు. అక్కడ తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.

ఏపీలోనే అంతంత మాత్రం..
పవన్ కల్యాణ్ పార్టీ అయిన జనసేన ఇప్పుడు ఏపీలోనే అంతంత మాత్రంగా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ లేదు. నేతలు లేరు. ఏపీలోనూ పార్టీని విస్తరించే పనికి ఆయన గత పదేళ్ల నుంచి పూనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ జనసేన విభాగం ఉంది. అక్కడ కూడా బలహీనంగానే ఉంది. తెలంగాణాలో భారీగా ఓట్లను చీల్చే పరిస్థితి ఆ పార్టీకి లేదన్నది కూడా అంతే యదార్థం. అలాంటి సమయంలో సెంటిమెంట్ విషయంలో తమిళనాడు నాలుగు ఆకులు ఎక్కువ చదువుకుంది. అలాంటి చోటకు వెళ్లి పార్టీని పెడతామని చెప్పడం, అక్కడ పార్టీ కార్యకలాపాలు విస్తరిస్తామని చెప్పడం కేవలం కంటితుడుపు చర్యేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
సొంత ఇంటిని చక్కబెట్టుకుంటే చాలంటూ...
ముందుగా ఆంధ్రప్రదేశ్ లో జనసేనను చక్కబెట్టుకుంటే చాలు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత పన్నెండు నెలల నుంచి అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ నేతలకు గాని, క్యాడర్ కు కాని ఒరిగిందేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏపీలో పవన్ కల్యాణ్ కు ఫ్యాన్స్ తో పాటు కాపు సామాజికవర్గం కూడా గత ఎన్నికల్లో నిలిచింది. అలాంటి కాపు సామాజికవర్గానికి మేలు చేకూర్చేలా ఇప్పటి వరకూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం, ప్రభుత్వాన్ని కనీసం తమ విషయంలో ప్రశ్నించకపోవడంతో కాపులు ఒకింత అసహనంతో ఉన్నారు. మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ ను పొగిడిన కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య లాంటి వారు కూడా ముందుగా కాపులు, ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలంలూ లేఖలు మీద లేఖలు రాస్తున్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలే...
మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జనసేన ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై తమకు నియోజకవర్గాల్లో పనులు కాలేదని వారు ఆవేదన చెందుతున్నారు. తాము గెలిచిన నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇన్ ఛార్జుల మాట నెగ్గుతుందని, అధికారులు తాము ఎమ్మెల్యేలమయినా తమ మాట వినడం లేదని నేరుగా మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదు చేశారంటే ముందుగా ఎమ్మెల్యేలను, తర్వాత ఏపీలోని పార్టీని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్ పై ఉందంటున్నారు. ఏదో ఇక ఇష్యూతో పొరుగు రాష్ట్రం వైపు చూస్తే పరువు పోతుంది తప్ప మిగిలేదేమీ ఉండదని, తమిళనాడులో కనీస ప్రభావం కూడా చూపలరన్నది విశ్లేషకుల భావన. మరి పవన్ కల్యాణ్ ఇప్పటికైనా తమిళనాడును వదిలేసి ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకుంటే చాలునన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News