Janasena : జనసేనలోనే చేరికలు ఎందుకు? అదే ముఖ్య కారణమా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నేతలకు నమ్మకం ఏర్పడింది. గతంలో మాదిరిగా ఆయన లీడర్లలో విశ్వాసాన్ని పొందుతున్నారు

Update: 2024-10-16 08:33 GMT

pawankalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నేతలకు నమ్మకం ఏర్పడింది. గతంలో మాదిరిగా ఆయన లీడర్లలో విశ్వాసాన్ని పొందుతున్నారు. అందుకే ఆ స్థాయిలో చేరికలు ఉంటున్నాయి. భవిష్యత్ అంతా జనసేనదేనని నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా జనసేన ఎదుగుదల ఖాయమని నేతలు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు పవన్ కల్యాణ్ చరిష్మాతో పాటు అభిమానుల లక్షల సంఖ్యలో ఉండటం, మెగా కుటుంబం అండదండలతో పాటు ప్రధానంగా బలమైన కాపు సామాజికవర్గం మద్దతు లభించి తాము ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. జనసేన తరుపున పోటీ చేస్తే చాలు గెలుపు గ్యారంటీ అని నేతల్లో ఒక బలమైన అభిప్రాయం నెలకొంది.

భవిష్యత్ ఉందని భావిస్తూ...
గత ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసి జనసేన అభ్యర్థులను విజయం సాధించారు. అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ గాజు గ్లాస్ పార్టీ సాధించింది. టీడీపీ తరువాత జనసేన బలమైన రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని విశ్విసిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతమున్న ప్రభుత్వంపై అసంతృప్తి అది నేరుగా పవన్ కల్యాణ్ పై ప్రభావం చూపే అవకాశం కూడా లేదు. చంద్రబాబు నాయుడు, టీడీపీలపైనే చూపనుందని, అందుకే టీడీపీపై ప్రజలు విసుగు చెందినా జనసేన వైపు మొగ్గు చూపుతారన్న ఆశతో నేతలు వరస బెట్టి గాజుగ్లాస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నది అందరూ అంగీకరించాల్సిందే.
పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటే...
పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటే సీటు కూడా ఖాయమని నమ్ముతున్నారు. పెద్దగా ఖర్చు లేకుండానే గెలిచే అవకాశాలను కూడా నేతలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే జనసేన విస్తరించే అవకాశాలుండటంతో ముందుగానే చేరి తమ రాజకీయ భవిష్యత్ కు మంచి బాటలు వేసుకోవాలన్న ప్రయత్నంలో నేతలున్నారు. అందుకే పవన్ కల్యాణ్ వద్దకు పరుగులు తీస్తున్నారు. ఎప్పటికైనా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ఉన్న భావన రోజురోజుకూ బలపడుతుంది. పేద, మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు పవన్ పాలసీని కొంత స్వాగతిస్తున్నారు. ఆయన విధానాలు, పనితీరు పట్ల ఆకర్షితులవుతున్నారు. లంచం లేకుండా, సొంత డబ్బులు లేకుండా ప్రజా సేవ కోసమే పవన్ కల్యాణ్ వచ్చినట్లు అధికశాతం మంది ప్రజలు ఈ ఎన్నికల తర్వాత గుర్తించినట్లు కనపడుతుంది.
కాపులే డిసైడింగ్ ఫ్యాక్టర్...
దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు మైనారిటీలు. వారే ముఖ్యమంత్రులుగా చెలామణి అవుతున్నారు. తక్కువ ఓటు బ్యాంకు ఉన్న ఆ సామాజికవర్గాల వారే ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు కాలేడన్న వాదన క్రమంగా వేళ్లూనుకుంటుంది. ఏపీలో కాపులు ఎక్కువ శాతం మంది ఉన్నారు. వారే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. అందుకే జనసేన కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ప్రధానంగా వైసీపీ కొంత వీక్ కావడం, టీడీపీ పై కూడా పెద్దగా ఆశలు లేకపోవడంతో పవన్ పై నేతల ఆశలు పెరిగాయంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ చేరికల విష‍యంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్ లో తమ పార్టీకి ఉపయోగకరంగా ఉంటారన్న నేతలకే అవకాశమిస్తున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ పార్టీకి మంచి రోజులు ముందుంటాయని నమ్మే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటంతో చేరికలు కూడా పెరుగుతున్నాయి.
Tags:    

Similar News