Pawan Kalyan : పవన్ కల్యాణ్ వ్యూహాన్ని గ్రౌండ్ చేస్తున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీర్ఘకాలిక వ్యూహంతోనే రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు

Update: 2024-10-15 06:09 GMT

janasena chief pawan kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీర్ఘకాలిక వ్యూహంతోనే రాజకీయాల్లో ముందుకు సాగుతున్నట్లు తెలిసింది. ఆయన గత ఎన్నికల్లో కూటమి ఏర్పడటానికిప్రధాన పాత్ర పోషించింది కూడా వ్యూహం ప్రకారమే. పవన్ వయసు చాలా చిన్నది. ఒకరకంగా వైసీపీ అధినేత జగన్ తో సమాంతరంగా భవిష్యత్ లో రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. జగన్ మాదిరిగానే పవన్ కల్యాణ్ కు ఫ్యాన్స్ తో పాటు క్యాస్ట్ బలం కూడా ఉంది. అయితే వైసీపీతో పోలిస్తే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి పెద్దగా బేస్ లేదు. క్యాడర్ ఉన్నా వారిని ఎవరినీ నమ్మి పదవులు అప్పగించలేని పరిస్థితి పవన్ కల్యాణ్‌ది. ముందు ముందు ఓటింగ్‌ను పెంచుకోవాలన్న ధ్యేయంతోనే పవన్ ఆలోచనలు సాగుతున్నట్లు ఆయన అడుగులు కనపడుతున్నాయి.

పాలనపైనే ఫోకస్...
అందుకే ముందుగా తనకు ఒక కీలకమైన పదవి అవసరం. అదే సమయంలో కీలక శాఖ కూడా అవసరమేనని గుర్తించిన పవన్ కల్యాణ్ కూటమిలో ప్రధాన పాత్ర పోషించారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఆయన ఎక్కువగా రాష్ట్ర సమస్యలపైనే దృష్టి పెట్టారు. మధ్యలో సనాతన ధర్మమంటూ తిరుమల లడ్డూ వివాదంలో తలదూర్చినప్పటికీ ఎక్కువ సమయం మాత్రం ఆయన పాలనపైనే ఫోకస్ పెట్టారు. తనకు ఇష్టమైన గ్రామీణ, పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖను ఎంచుకుని మరీ తీసుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ గ్రామ స్థాయిలో ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టేశారు.
పట్టు సంపాదించడం కోసం...
గ్రామాల్లో జనసేన పార్టీకి బేస్ ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్ లో ఓటు బ్యాంకు కు ఢోకా ఉండదని ఆయన భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎటూ కాపు సామాజికవర్గంతో పాటు, సినీ అభిమానులుంటారు. వారు ఎటూ వెళ్లరు. తనకు అండగా నిలుస్తారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తనను ఆదరించేందుకు పట్టణ ప్రాంతంలో వారు రెడీగా ఉంటారు. గ్రామీణ ప్రాంతంలో పట్టు తక్కువ. అందుకే ఆయన గ్రామాలపై పట్టుసంపాదించుకోవడానికి వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపడుతూ పవన్ వచ్చిన తర్వాతనే గ్రామాల అభివృద్ధి జరిగిందన్న సంకేతాలను తీసుకెళుతున్నారు.
పల్లె పండగ తో...
ఆగస్టు 23వ తేదీన పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామసభలను నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు. గ్రామసభల్లో చేసిన తీర్మానాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 20 వరకు పల్లె పండుగ వారోత్సవాలను చేయాలని నిర్ణయించారు. నిన్నటి నుంచి ఈ పల్లె పండగ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 వేలకు పైగా పంచాయతీల్లో ముప్ఫయివేల అభివృద్ధి పనులను ఒక్కసారి చేపట్టనున్నారు. రహదారుల నిర్మాణం, తాగు నీటి సరఫరా వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. ఈ రకంగా పల్లెల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవాలన్నదే పవన్ ఆలోచనగా ఉందని తెలిసింది. భవిష్యత్ లో ఇది తన పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Tags:    

Similar News