సొంత పార్టీనేతలను...
తొలిసారి గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు. అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొని చంద్రబాబుకు దగ్గరై కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు టిక్కెట్‌ను సంపాదించారు. చివరకు సీనియర్ నేతలు జవహర్‌ను కూడా పక్కన పెట్టి కొలికపూడికి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన వెంటనే తన వైఖరిని పూర్తిగా మార్చారు. సొంతపార్టీ నేతలనే వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తిరువూరు నియోజకవర్గంలో ఒక ఇంటిని కూల్చివేయడానికి తానే కుర్చీ వేసుకుని కూల్చేందుకు చేసిన ప్రయత్నం కూడా విమర్శలకు దారి తీసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొలికపూడి శ్రీనివాసరావును పిలిచి క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి.
కమ్మ సామాజికవర్గంపై....
ఇక ఇటీవల కొలికపూడి కమ్మ సామాజికవర్గం నేతలపై చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారమే రేపాయి. తిరువూరులో తక్కువ శాతం ఉన్న కమ్మ సామాజికవర్గం నేతల ఆధిపత్యం ఏంటని ఆయన బహిరంగంగానే ప్రశ్నించారు. అన్నిపదవులు, ప్రధానమైనవన్నీ కమ్మవారికే కావాలంటే ఎలా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలుపునకు కారణమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు ఎలా వస్తాయని, కమ్మోళ్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన గట్టిగా కృష్ణా జిల్లాలో ప్రశ్నించడంతో ఆయన వైఖరిపై తెలుగుదేశంపార్టీ అధినాయకత్వం గుర్రుగా ఉంది. కొలికపూడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని తిరువూరులోని ముఖ్య నేతలతో పాటు కమ్మ సామాజికవర్గం నేతలు కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. లోకేష్ కూడా ఆయన వైఖరిని తప్పుపట్టినట్లు చెబుతున్నారు.
అన్నదమ్ముల వివాదంలో...
తాజాగా తిరువూరు నియోజకవర్గంలోని గొపాలపురంలో ఒక రహదారికి సంబంధించి ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తలదూర్చారు. వారిలో ఒక వర్గానికి అండగా నిలబడ్డారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి తమను కొట్టి అవమానపర్చారంటూ భూక్యా చంటి పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వైసీపీ వార్డు సభ్యురాలిగా ఉన్న భూక్యాచంటిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవలో ఎమ్మెల్యే తలదూర్చి పార్టీకి తలనొప్పిగా మారారంటున్నారు. అయితే భూక్యాచంటికి ప్రమాదం తప్పిందని వైద్యులు చెప్పారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు అందింది. ఈ వివాదానికి సంబంధించి కొలికపూడి నుంచి వివరణ తీసుకోవాలని చంద్రబాబు పార్టీనేతలను ఆదేశించారు. మొత్తం మీద ఎమ్మెల్యే కొలికపూడి పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా ఆగేట్లు లేడని, ఆయనను వదిలించుకోవడమే మేలన్న అభిప్రాయం పార్టీ అధినాయకత్వంలో మొదలయిందంటున్నారు.