కృష్ణాష్టమి విశిష్టత.. ఆచరణ

కృష్ణాష్టమి శ్రీకృష్ణుని జన్మదినాన్ని సూచిస్తుంది. భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు

Update: 2023-09-05 18:17 GMT

విశిష్టత.. ఆచరణ

కృష్ణాష్టమి శ్రీకృష్ణుని జన్మదినాన్ని సూచిస్తుంది. భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి, కృష్ణాష్టమి, కృష్ణ జన్మాష్టమి వంటి పేర్లతో పిలుస్తారు.

ఈ ఏడాది సెప్టెంబరు 6, 7 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మపురాణం చెబుతోంది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణుడు. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు.

గుజరాతీల సంప్రదాయం ...

గుజరాత్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీజగదాష్టమి అని పిలుస్తారు. గుజరాతీల సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండగకు నాలుగురోజుల ముందునుంచే పూజలు ప్రారంభమవుతాయి. పండగకు నాలుగురోజుల ముందు వచ్చే చవితినాడు ఆవు, లేగదూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు. బాజ్రీ పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు. కృష్ణుడు గోవులను సంరక్షించేవాడు అందువల్ల గుజరాతీలు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నం తినకుండా రెండ్రోజుల ముందుగానే మిఠాయిలు, ఫలహారాలు, కార, చుడువా, గారెలు వంటివి తయారుచేసుకుంటారు. ప్రత్యేకంగా మినపప్పు పిండితో తయారుచేసిన ‘అడిది’ పేరుగల మిఠాయిలు తయారుచేస్తారు. ఒకరోజు ముందు నుంచే ఉపవాసదీక్షలు పాటిస్తారు.

యాదవుల సామూహిక వేడుకలు

కృష్ణుడు అనగానే యాదవులు గుర్తుకొస్తారు. ఆ కులస్థులు కృష్ణుడిని కులదైవంగా కొలుస్తూ వస్తున్నారు. కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో, పట్టణాల్లోనూ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యాదవులు అత్యధికులు కలిగిన గ్రామాల్లో కృష్ణాష్టమికి ఒకరోజు ముందు నుంచే ఈ వేడుకల్లో నిమగ్నమవుతారు. అర్ధరాత్రి నుంచి వేడుకలను ప్రారంభిస్తారు. కృష్ణాష్టమి రోజున వూయలలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కనులపండువగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. తమ చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు. కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ముగింపు ఘట్టంగా నిర్వహించి సహపంక్తి భోజనాలతో వేడుకలను ముగిస్తారు. గ్రామాల్లోనూ వూరేగింపులు చేసి ఆలయాల వద్ద కుల పెద్ద చేత ఉట్టికొట్టిండం, సామూహిక భోజనాలు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో గ్రామాల్లోని ఇతర కులస్థులు సైతం పాలుపంచుకోవడం పండగకు మరింత వన్నె తెస్తోంది.

తిరుమల శ్రీవారి సన్నిధిలో..

తిరుమల ఆలయలో శ్రీనివాసుని ప్రక్కనే రజతమూరి శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటూ ఉంటుంది. 11వ శతాబ్దానికి పూర్వమే కృష్ణుడి విగ్రహం ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువుదీరుతారు. ఈ కొలువును 'గోకులాష్టమీ ఆస్థానం' అని వ్యవహరిస్తారు. సర్వాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు. మరునాడు నాలుగు మాడ వీధుల్లో శిక్యోత్సవం (ఉట్ల పండుగ) కోలాహలంగా జరుగుతుంది. ఇది కృష్ణుడి బాల్యక్రీడకు సంబంధించిన వేడుక.

Tags:    

Similar News