తిరుమలలో చిరుత - భయాందోళనలో ప్రజలు
తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను భయాందోళనలకు గురి చేస్తుంది
తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను భయాందోళనలకు గురి చేస్తుంది. నిన్న రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలోని కంట్లోర్ రూమ్ వద్దకు చిరుత వచ్చింది. దీంతో అక్కడ ఉన్న కుక్కలు మొరిగాయి. కుక్కలు వెంటపడటంతో చూసిన సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి వెళ్లి తాళం వేసుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తిరుమలలో చిరుత పులి సంచారం నిత్యం జరుగుతూనే ఉంటుంది. క్రూర జంతువుల సంచారంతో రాత్రి వేళలో మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకోవాలంటే ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.
గతంలో కనిపించి...
చిరుతతో పాటు అనేక క్రూర జంతువులు గతంలో వచ్చి భక్తులను భయపెట్టాయి. దీంతో అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని చర్యలు ప్రారంభించింది. రాత్రి వేళ గుంపులుగా భక్తులను పంపాలని, వారికి తోడు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇచ్చి పంపడం వంటి చర్యలు తీసుకుంది. అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గంలో భక్తులకు కర్రలను కూడా ఇచ్చింది. అయితే మళ్లీ చిరుత పులి కనిపించడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి.