రైళ్ల ప్రమాదం : ఏపీ ప్రయాణికుల వివరాలు వెల్లడించిన మంత్రి
రెండు రైళ్లలో మొత్తం 695 మంది ఏపీ వాసులు ప్రయాణించినట్లు తెలిపారు. వారిలో 553 మంది సురక్షితంగా ఉన్నారని..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ప్రమాదానికి గురైన కోరమాండల్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ ల్లో ఏపీకి చెందిన ప్రయాణికుల వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు రైళ్లలో మొత్తం 695 మంది ఏపీ వాసులు ప్రయాణించినట్లు తెలిపారు. వారిలో 553 మంది సురక్షితంగా ఉన్నారని, మరో 92 మంది తాము రైలు ప్రయాణం చేయలేదని తెలిపినట్లు చెప్పారు. మిగతా 28 మంది ఇంకా ఫోన్ కాల్స్ కు స్పందించలేదన్నారు. వారి ఫోన్ నంబర్ల ఆధారంగా లొకేషన్ గుర్తించి అధికారులు ఇళ్లకు వెళ్లి సమాచారం సేకరిస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రమాదంలో మరో 22 మంది ఏపీవాసులు స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. వారందరికీ ప్రస్తుతం ఒడిశాలోని ఆసుపత్రిలో, విశాఖ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్లు తెలిపారు. మంత్రి అమర్నాథ్, ఆరుగురు అధికారుల బృందం ఒడిశాలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంకు అందిస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురంకు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి మృతి చెందగా.. అతని కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.