Jana Sena : పవన్ చెంతకు నేతలు ఎందుకు చేరుతున్నారో తెలుసా? అసలు రీజన్ అదేనట

అనేక మంది పార్టీ నేతలు వైసీపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారికి జనసేన మినహా మరే పార్టీ కనిపించడం లేదు.

Update: 2024-09-21 07:26 GMT

pawankalyan

వైసీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్ లో కూడా అనేక మంది పార్టీ నేతలు వైసీపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కూటమిలోని సేఫెస్ట్ పార్టీని పార్టీని వీడే నేతలు వెతుక్కుంటున్నారు. వారికి జనసేన మినహా మరే పార్టీ కనిపించడం లేదు. జనసేనలో చేరితే అన్నింటా సేఫ్ గా ఐదేళ్లు తమ రాజకీయ జీవితం గడిచిపోతుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల పరిస్థితి అప్పుడు చూసుకోవచ్చన్న ఒకే ఒక కారణంతో వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ తమకు ఐదేళ్ల పాటు అండగా నిలుస్తారన్న ఏకైక నమ్మకంతో వారు జెండాను మార్చేస్తున్నారు.

టీడీపీలో చేరడానికి...
కూటమి ప్రభుత్వంలో మిగిలిన రెండు పార్టీల వైపు పెద్దగా వైసీపీ నేతలు చూడటం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలతో ఇప్పటికే ఫుల్లయిపోయింది. ఆ పార్టీలోనే నేతలు ఎక్కువయ్యారు. ప్రతి నియోజకవర్గంలో ఇన్‌ఛార్జులతో పాటు నేతలు కూడా ఉండటంతో పాటు ఒక బలమైన సామాజికవర్గం డామినేషన్ నేతల చేరికకు తలుపులు వేస్తుందని చెబుతున్నారు. వైసీపీలో బలమైన సామాజికవర్గాన్ని ఎలా తట్టుకోలేకపోయామో? అదే పరిస్థితి టీడీపీలో కూడా ఉండటంతో ఆ పార్టీలో చేరేందుకు నేతలు కొంత జంకే పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీలో చేరినా పెద్దగా ప్రయోజనం ఉండదని, పదవులు, టిక్కెట్ల విషయంలో నమ్మకం లేదని నేతలు దూరంగా ఉన్నారన్నది అర్థమవుతుంది.
బీజేపీలో చేరామంటే?
కూటమిలో ఇంకో పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ సిద్ధాంతాల పేరుతో నడుస్తుంది. ఇక్కడ టిక్కెట్ల కేటాయింపు జరగదు. ఎవరికీ పెద్దగా గుర్తింపు కూడా ఉండదు. కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకే టిక్కెట్ల కేటాయింపు జరుగుతుంది. గత ఎన్నికల్లో పెద్ద పెద్ద నేతలకే టిక్కెట్లు దక్కలేదు. మంత్రివర్గంలోనూ తాము ఊహించని లీడర్లను కేంద్ర నాయకత్వం పక్కన పెట్టింది. అలాంటి చోటికి తాము వెళ్లి జెండా పట్టుకు తిరిగినా రాజకీయ ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతుంది. వరదాపురం సూరి లాంటి నేతలకే టిక్కెట్ దక్కలేదు. సుజనాచౌదరి లాంటి నేతలకు కేబినెట్ లో చోటు దక్కలేదు. అక్కడకు వెళ్లడం వృధా ప్రయాస అన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతుంది.
గాజు గ్లాస్ అయితే...?
ఇక జనసేన ఒక్కటే అన్నింటికీ అనువైన పార్టీగా కనపడుతుంది. పవన్ పెద్దగా ప్రజల్లోకి రారు. నియోజకవర్గాల్లో తామే నేతలుగా పెత్తనం చేయవచ్చు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో పవన్ సాయంతో టిక్కెట్ ను కూడా సులువుగానే తెచ్చుకోవచ్చు. అంతే కాకుండా నియోజకవర్గాల సంఖ్య కూడా వచ్చే ఎన్నికల నాటికి పెరుగుతుంది. మనకు ఎక్కడో చోట అవకాశం లభిస్తుంది. బలమైన కాపు సామాజికవర్గం తో పాటు పవన్ అభిమానులు, మెగా కుటుంబం ఫ్యాన్స్ తమకు అనుకూలంగా మారి గెలుపు అవకాశాలను సులువుగా మారుస్తాయి. దీంతో పాటు ఏ కోణంలో చూసినా జనసేన ది బెస్ట్ పార్టీగా భావించి అందులోకి నేతలు వస్తున్నారు. రానున్న కాలంలో మరింత మంది నేతలు వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News