Andhra Pradesh : నేడు మరో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
ఈరోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయి
ఆంధ్రప్రదేశ్ మరో గండం పొంచి ఉంది. ఈరోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్సాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలిక పాటి జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని కూడా తెలిపింది. అందుకే బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో చెట్ల కింద ఎవరూ ఉండ కూడదని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ ప్రాంతాల్లో...
వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలుకురిసే అవకాశముందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని వివరించింది. మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనంటూ వాతావరణ శాఖ తెలపడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. అన్ని ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.