పుతిన్ తో చెప్పుకో పవన్: మంత్రి అమర్నాథ్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో సీఎం జగన్ పై విషం, విద్వేషం కనిపిస్తోందన్నారు. ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రుషికొండ వరకు వెళ్లిన పవన్‌కు పక్కనే గీతం సంస్థ చేసిన అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం, ప్రభుత్వ భూమినే కబ్జా చేయడం అనే విమర్శ అవగహన రాహిత్యానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వాళ్లకు సహకరిస్తున్న మీడియా అందరూ స్టువర్ట్‌పురం దొంగలని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. బానిసత్వంలో బ్రతుకుతూ.. వాలంటీర్ల వ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
వాలంటీర్లను దండు పాళ్యం బ్యాచ్ అని అవమానించడానికి నోరెలా వస్తోందని అన్నారు పూర్తి అనుమతులతో రుషికొండ అభివృద్ధి జరుగుతుంటే.. వచ్చిన నష్టం, అభ్యంతరం ఎందుకో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలనే ఆలోచన తప్ప పవన్ కళ్యాణ్‌కు ఒక విధానం లేదని అన్నారు. గట్టిగా ప్రశ్నిస్తే కేంద్రంతో చెప్పి ఆటాడిస్తానని పవన్ బెదిరిస్తున్నాడని.. కేంద్రంతో కాకపోతే పుతిన్‌తో చెప్పుకో అని మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. డాడీ, దత్తపుత్రుడు విడతల వారీగా విశాఖకు వచ్చి అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆగస్టు 15కు పవన్ మంగళగిరి వెళితే.. చంద్రబాబు విశాఖ వస్తున్నారన్నారు. ఇద్దరు వేర్వేరుగా తిరగడం ఎందుకు, కలిసి మెలిసి పర్యటించడం మంచిదని హితవు పలికారు.