Mlcs : ఏం ఖర్మరా నాయనా... లక్షలకు లక్షలు వేతనాలు తీసుకుంటూ. ఈ కక్కుర్తి ఏంటి?

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీలు నిత్యం వివాదాల్లో చిక్కు కుంటున్నారు. పెద్దల సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సి వాళ్లు జనం నోళ్లలో నానుతున్నారు

Update: 2024-10-20 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీలు నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పెద్దల సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సి వాళ్లు జనం నోళ్లలో నానుతున్నారు. అలా ఇలా కాదు.. ఎక్కడ పట్టినా వీళ్ల గురించే టాక్. వీరు ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు కానీ.. వీరిలో ఎక్కువ మంది వైసీపీకి చెందిన వారే కావడంతో ఇప్పుడు మరింతగా సోషల్ మీడియాలో రచ్చ మొదలయింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎమ్మెల్సీల అరాచకాలను ఎండకడుతూ వీరికా పెద్దల సభలో స్థానం కల్పించిందంటూ కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. మరోవైపు వాళ్లెవరూ తమ పార్టీ కాదంటూ వైసీపీ సర్ది చెబుతున్నప్పటికీ, వారికి పదవులు ఇచ్చింది మాత్రం ఫ్యాన్ పార్టీనేనని చెప్పక తప్పదు.

లవర్ బాయ్.. డోర్ డెలివరీ...
ఒకరు లవర్ బాయ్.. మరొకరు హత్య చేసి డోర్ డెలవరీ.. మరొకరు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్వనం టిక్కెట్లు విక్రయించుకోవడం..ఇంకొకరు శిరోముండనం కేసు ఇలా అనేక వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు వైసీపీకి కూడా ఇబ్బందికరంగా మారింది. కాంట్రవర్సీ కాండిడేట్స్ ను జగన్ ఎంపిక చేసి ఆయన సెలక్షన్ రాంగ్ అని చెప్పకనే చెప్పినట్లయింది. దీంతో ఇది అధికార తెలుగుదేశం పార్టీకి కలసి వచ్చినట్లయింది. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తక్కువమే కాదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనను పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు. అయితే న్యాయస్థానం ఆ కేసును కొట్టివేయడంతో కొద్దిగా ఆ పార్టీ ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఫిర్యాదు దారు రాజీపడటంతోనే కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
పార్టీ నుంచి సస్పెండ్ చేసినా...?
తూర్పు గోదావరికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి వారి ఇంటికే డోర్ డెలివరీ చేశారని కేసు నమోదయింది. అంతేకాదు అనంతబాబు కొన్ని నెలల పాటు రాజమండ్రి జైలులో గడిపి బెయిల్ పై బయటకు వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఈ హత్య ఘటనకూడా వైసీపీ ఓటమికి ఒక కారణమయిందని చెప్పాలి. దళితుడిని హత్యచేశారన్న ఆరోపణలున్నా పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఎమ్మెల్సీగా నాడు అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ పదవి రద్దు చేయకపోవడం విమర్శలు తావిచ్చింది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితమైనప్పటికీ ఆయన గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. భార్య వాణిని కాదని, మాధురితో కలసి పర్యటనలు చేస్తూ ఇటు పార్టీ పరువును కూడా మంట గలుపుతున్నారు. అయినా ఆయనపై పార్టీ ఇంత వరకూ చర్యలు తీసుకోకపోవడంపై ఫ్యాన్ పార్టీలోనే చర్చ జరుగుతుంది.
శ్రీవారి దర్శనం టిక్కెట్లు...
ఇక దళితుల శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కూడా వైసీపీ పట్ల వ్యతిరేకత రావడానికి ఒక కారణంగా చెబుతారు. ఇక తాజాగా జకియా ఖానం తిరుమల శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఆమెపై తిరుమల విజిలెన్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్కొక్క టిక్కెట్ పది వేల రూపాయలకు అమ్ముకున్నారు. జీతాలు తక్కువా? అంటే వేతనం, అలవెన్సులు కలిపి నెలకు లక్షల్లో వస్తాయి. కానీ ఈ కక్కుర్తి ఏంటి? అన్న చర్చ సాగుతుంది. అయితే జకియా ఖానం తమ పార్టీలో లేదని వైసీపీ చెప్పుకుంటుంది. కానీ ఆమెను ఎమ్మెల్సీ చేసింది ఎవరన్న ప్రశ్నకు మాత్రం ఫ్యాన్ పార్టీ నేతల నుంచి సమాధానం లేదు. మొత్తం మీద ఎమ్మెల్సీలు వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు.


Tags:    

Similar News