Mudragada : ముద్రగడ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ రేటు ఎంత?

ద్రగడ పద్మనాభం మరోసారి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Update: 2024-12-04 08:29 GMT

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభానికి పేరు. అయితే ఆ ట్యాగ్ లైన్ ఆయనంతట ఆయనే వదిలేసుకున్నారు. ఇప్పుడు పక్కా పంఖా నేత ఆయన. ఫ్యాన్ పార్టీలో సీనియర్ నేత. అందుకే ముద్రగడ పద్మనాభం మరోసారి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముద్రగడ పద్మనాభం నిజాయితీకి మారుపేరు అంటారు. అదే సమయంలో కొంత నిక్కచ్చిగా కూడా ఉంటారన్న పేరుంది. ఎన్టీఆర్ హయాం నుంచి ఆయనకు మంచి పేరుంది. ప్రయివేటు బస్సుల విషయంలో ముద్రగడ నాడు మంత్రి పదవికి కూాడా రాజీనామా చేశారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి అనేక పార్టీలు మారారు. కాంగ్రెస్, బీజేపీ తాజాగా వైసీపీలో చేరారు. ఇన్ని పార్టీలు మారినా ఆయనకు దశాబ్దాలుగా రాజకీయాలు అచ్చిరావడం లేదు. పార్టీలు మారినా ఆయనకు అధికార పదవి లభించడం లేదు. ఆయన సన్నిహితుల్లో ఇదే రకమైన ఆవేదన తరచూ వినపడుతూ ఉంటుంది.

కొన్నా ళ్ల నుంచి కిర్లంపూడికే…

కిర్లంపూడి కే ముద్రగడ పద్మనాభం పరిమితమయ్యారు. తెలుగుదేశం పార్టీ 2014 లో అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని పీక్ కు తీసుకెళ్లారు. అదే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దానిని మర్చిపోయారు. దీంతో ముద్రగడ పద్మనాభం సోషల్ మీడియాలో వ్యతిరేకంగా కామెంట్స్ పెద్దయెత్తున కనిపించాయి. అయినా ముద్రగడ మాత్రం లెక్క చేయలేదు. ఒకదశలో జనసేనలో చేరాలని భావించినా పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదంటారు. దీంతో ముద్రగడ పద్మనాభం గత ఎన్నికలకు ముందు వైసీపీ లో అధికారికంగా చేరిపోయారు. కండువా కప్పేసుకున్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో కాపులు అత్యధికంగా ఉన్న తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వైసీపీ దారుణంగా ఓటమిపాలయింది. ఒక్క స్థానం కూడా గెలవలేదు. దీంతో ముద్రగడ పద్మనాభాన్ని కాపులు ఎవరూ విశ్వసించలేదని, పవన్ కల్యాణ్ మాత్రమే తమ నాయకుడిగా భావించినట్లు స్పష్టమయింది. అంటే మొన్నటి ఎన్నికల్లో ముద్రగడ ముద్ర ఏమాత్రం పనిచేయలేదని అర్థమయింది. చివరకు ఆయన కుటుంబ సభ్యులే వ్యతిరేమయ్యారంటే పరిస్తితి వేరే చెప్పాల్సిన పనిలేదు.

కీలకంగా మారి…

కానీ వైసీపీ ఓటమి తర్వాత ముద్రగడ పద్మనాభం ఆ పార్టీలో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభానికి మించిన కాపు నేత మరొకరు లేరు. అందుకే ఆయనకు పూర్తి ప్రాధాన్యత జగన్ ఇచ్చే అవకాశాాలు పుష్కలంగా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో తిరిగి కాపులను వైసీపీకి దరి చేర్చాలంటే ముద్రగడ వల్లనే సాధ్యమవుతుందని జగన్ నమ్మే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పార్టీకి అంతకు మించిన నేతకూడా ఎవరూ లేరు. కాపులను ఏకం చేయగలిగిన సత్తా ఉన్న నేత మరొకరు లేకపోవడం కూడా ముద్రగడ పద్మనాభానికి వైసీపీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. అందుకే జగన్ ఏమాత్రం ఆలోచించకుండా జగన్ ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబుకు ప్రత్తిపాడు నియోజవకర్గ బాధ్యతలను అప్పగించారు. త్వరలో నియోజకవర్గానికి ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించి వచ్చే ఎన్నికల్లో గిరిని ప్రత్తిపాడు నుంచి ఎన్నికల్లో దింపాలన్న యోచనలో జగన్ ఉన్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తే…

మరోవైపు సీనియర్ నేతగా ముద్రగడ పద్మనాభానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి. ఒకవేళ మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే సీనియర్ నేతగా ముద్రగడ పద్మనాభానికి పెద్దపదవే జగన్ ఆఫర్ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను కష్టకాలంలో ఉన్న ప్పపుడు అండగా ఉన్న నేతలను జగన్ వదిలిపెట్టరన్న అభిప్రాయం ఉంది. అదే జరిగితే ముద్రగడకు వైసీపీ అధికారం వస్తే “పెద్ద” పదవే వచ్చే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయటం లేదు.ముద్రగడ పద్మనాభం కూడా ఈ నాలుగేళ్లు కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. జగన్ అప్పగించిన బాధ్యతలను తాను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే అధికార పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలకు కూడా సిద్ధమవుతారు. కాపులను కూడగట్టడంలో సక్సెస్ కావడమే ముద్రగడ ముందున్న లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకే ముద్రగడ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ మేరకు రాజకీయంగా విజయం సాధిస్తారన్నది కాలమే తేల్చాల్సి ఉంది.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News