ఇలా నేతలందరూ ఉంటే ఎంత బాగుంటుంది..వైసీపీ, ఎన్గీఏ అభ్యర్థి ఆత్మీయ పలకరింపు

నరసాపురం ఎన్డీఏ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైసీపీ ఎంపీ అభ్యర్థి ఉమాబాల పాలకొల్లులో ఇద్దరూ ఎదురెదురుపడ్డారు.;

Update: 2024-05-06 06:58 GMT

ఎన్నికలు అంటే పార్టీల అభ్యర్థులు శత్రువులుగా మారిపోతారు. ఎన్నికల్లో గెలిపించేది ప్రజలే అయినా.. సభల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలించే వరకూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తుంటారు. పార్టీల నేతలే కాదు క్యాడర్ కూడా అదే తరహాలో కసిగా ఉంటుంది. తమ నేతపై నెగిటెవ్ కామెంట్ చేసిన అభ్యర్థి అటువస్తే వాళ్ల వాహనాలను కూడా ధ్వంసంచేస్తుంటారు. క్యాడర్ లో జోష్ నింపడానికే నేతలు ఒకరిపై ఒకరు పార్టీ పరంగానే కాదు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటారు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఈరకమైన కక్షలు, కార్పణ్యాలు రాజకీయాల్లో ఎక్కువగానే చూస్తుంటాం.

పాలకొల్లులో...
కానీ నరసాపురం నియోజకవర్గం పరిధిలో దానికి విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు కలుసుకుని ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసి ఇలాఅందరూ రాజకీయాలు చేస్తే ఎంత బాగుంటుంది? అన్న ఆలోచన అందరికీ కలగక మానదు. నరసాపురం ఎన్డీఏ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైసీపీ ఎంపీ అభ్యర్థి ఉమాబాల పాలకొల్లులో జరిగిన ఒక కార్యక్రమంలో ఇద్దరూ ఎదురెదురుపడ్డారు. అయితే ఇద్దరూ కలసి కరచాలనం చేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. గత కొన్ని రోజులుగా విమర్శలు చేసుకుంటూ తిరుగుతున్న ఇద్దరు నేతలు కలసి ఆప్యాయంగా పలకరించుకుంటున్న ఫొటోలను చూసి క్యాడర్ ఆశ్చర్యపోగా, ప్రజలు మాత్రం వీరి వ్యవహార శైలిని చూసి మెచ్చుకుంటున్నారు.


Tags:    

Similar News