Lavu Srikrishna Devaralu : లావు ఇప్పుడు కంఫర్ట్ గా ఉన్నారట... ఫుల్ హ్యాపీస్
నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం పార్టీలో హ్యాపీగా ఉన్నట్లే కనిపిస్తుంది.
నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం పార్టీలో హ్యాపీగా ఉన్నట్లే కనిపిస్తుంది. ఆయనకు తన నియోజకవర్గం పరిధిలో ఏ ఎమ్మెల్యేతో ఇప్పటి వరకూ విభేదాలు తలెత్తలేదు. దీంతో లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ మారి మంచి పనిచేశారన్న అభిప్రాయం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతుంది. లావు శ్రీకృష్ణ దేవరాయలు అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలకు ముందు లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీలో చేరారు. అయితే వెంటనే లావుకు నరసరావుపేట పార్లమెంటులో పోటీ చేసే అవకాశం లభించింది. ఆ ఎన్నికల్లో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావును ఓడించి రాజకీయాల్లో కీలకంగా మారారు.
ఎమ్మెల్యేలతో పొసగక...
అయితే వైసీపీలో లావు శ్రీకృష్ణ దేవరాయలు అంత హ్యాపీగా లేరు. వైసీపీ ఎమ్మెల్యేలతో పొసిగేది కాదు. ఎవరూ ఆయనను దగ్గరకు రానిచ్చే వారు కాదు. కమ్మ సామాజికవర్గం నేత కావడంతో ఒకింత వైసీపీలో లావును ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేయలేదన్న టాక్ బలంగా వినిపించేది. నాడు చిలకలూరి పేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజనీతో అస్సలు పడేది కాదు. చిలకలూరిపేట నియోజకవర్గంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు పర్యటనకు కూడా విడదల వర్గం సహకరించేది కాదు. అనేక అవమానాలు పొందారు. ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు ఎమ్మెల్యేలకే మద్దతుగా నిలిచే వారు తప్పించి, లావుకు అండగా నిలిచే వారు కాదు. దీంతో విసిగిపోయిన లావు శ్రీకృష్ణ దేవరాయలు 2024 ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
టీడీపీలో చేరి...
2024 ఎన్నికలకు ముందు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన కోరుకున్నట్లే నరసరావుపేట టీడీపీ టిక్కెట్ లభించడం, కూటమి అభ్యర్థిగా పోటీ చేయడంతో గెలుపు సులువుగా మారింది. వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పై విజయం సాధించారు టీడీపీ పార్లమెంటరీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలును చంద్రబాబు నియమించారు. గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కూడా సఖ్యత ఉంది. చంద్రబాబు నాయుడు కూడా లావుకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. లావు కుటుంబానికి ఉన్న పేరు, ప్రఖ్యాతులు మాత్రమే కాకుండా, ఆ కుటుంబం పట్ల ఉన్న గౌరవం కూడా చంద్రబాబుకు లావు శ్రీకృష్ణ దేవరాయలును మరింత దగ్గరగా చేర్చిందని భావించాలి. ఆయన తండ్రి లావు రత్తయ్యకు ఉన్న పేరు ప్రతిష్టలు కూడా లావు శ్రీకృష్ణ దేవరాయలుకు కలసి వచ్చినట్లే అనుకోవాలి.
ఫ్యూచర్ అంతా టీడీపీలోనే...
ఇప్పుడు టీడీపీలో లావు శ్రీకృష్ణ దేవరాయలుకు ఎలాంటి రాజకీయపరమైన ఇబ్బందులు లేవు. ఒక పార్లమెంటు సభ్యుడికి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ఎమ్మెల్యేలంతా కలసి లావుకు చిన్నవయసని చూడకుండా పదవి చూసి గౌరవమిస్తున్నారు. గుంటూరు జిల్లాలో భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీకి లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యమైన నేతగా మారినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. చిన బాబు లోకేష్ తో సన్నిహితంగా ఉండటంతో వచ్చే ఎన్నికల నాటికి లావు ఫేట్ మారి అసెంబ్లీ బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే లావు ఇప్పుడు కంఫర్ట్ గా ఉన్నారని, ఆల్ హ్యాపీస్ అని ఆయన అనుచరులు బహిరంగంగా చెప్పుకుంటుున్నారు. అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా ఎదిగిన లావు శ్రీకృష్ణ దేవరాయలకు టీడీపీలోనే మంచి ఫ్యూచర్ ఉందని ఆయన సన్నిహితులు కూడా అభిప్రాయపడుతున్నారు.