రెడ్డి సామాజికవర్గం బలంగా…
నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంటుంది. గెలుపోటములను శాసించేది ఆ వర్గమే. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు కూడా ఆ వర్గానికి చెందిన వారే. కానీ అదే వర్గం గత వైసీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం చెందిందని అనుకోవాలి. రెడ్లు అడ్డం తిరగడంతోనే ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయని ఎన్నికల అనంతరం జరిగిన విశ్లేషణలలో అర్థమయింది. రెడ్డి సామాజికవర్గంతో పాటు వారి ప్రభావంతో మిగిలిన సామాజికవర్గాలు కూడా కూటమి వైపు నిలిచాయంటారు. అందుకే నెల్లూరు జిల్లాలో ఒక్క చోట కూడా వైసీపీ జెండా ఎగరలేదు. నిజానికి జగన్ నెల్లూరు జిల్లాపై పెద్ద హోప్స్ పెట్టుకున్నారు. తన సొంత జిల్లా అయిన కడప జిల్లా తర్వాత ఎక్కువగా తమ పార్టీని ఆదరించేది నెల్లూరు జిల్లా మాత్రమేనని విశ్వసించారు. కానీ జగన్ అంచనాలు బూమ్ రాంగ్ అయ్యాయి. కానీ ఓడిపోయిన తర్వాత కూడా ఈ జిల్లాపై జగన్ పెద్దగా దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. అక్కడ నష్టనివారణ చర్యలు చేపట్టడానికి సిద్ధం కాలేదు.
సీనియర్ నేతలున్నా…
నెల్లూరు జిల్లాలో వైసీపీకి సీనియర్ నేతలకు కొదవలేదు. మేకపాటి కుటుంబం, ఆదాల, నల్లపురెడ్డి, నేదురుమిల్లి ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ ఉద్దండులే. డక్కామొక్కీలు తిన్న నేతలే. తమ నియోజకవర్గాలపై పట్టున్న నేతలే. ముఖ్యమంత్రి జగన్ వద్ద అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే. నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో పట్టుబట్టి నిధులను సాధించుకునే స్థాయి ఉన్న నేతలు. నేరుగా ముఖ్యమంత్రితో పాటు సంబంధిత శాఖ మంత్రులను కలసి ఉత్తర్వులను విడుదల చేయించుకోగల సత్తా ఉంది. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఈ నేతలకు పెద్దగా ప్రయారిటీ లభించలేదంటారు. అలాగే రెడ్డి సామాజికవర్గం నేతలను కూడా దూరం పెట్టడంతోనే వైసీపీ అధినాయకత్వంపై గుర్రుతోనే స్థానికంగా ఉన్న లీడర్లను ఓడించారన్నది వాస్తవమని చెప్పకతప్పదు. జగన్ చేసిన పనుల వల్లనే నెల్లూరు జిల్లాలో పార్టీకి భారీ డ్యామేజీ జరిగిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇప్పుడు కూడా…
సరే.. వైఎస్ జగన్ ఇప్పుడు తాను మారానంటున్నాడు. గతంలో మాదిరిగా తన పాలన ఉండదని హామీ ఇస్తున్నాడు. అయినా సరే నెల్లూరు జిల్లా నేతలు ఎవరూ బయటకు రావడం లేదు. నెల్లూరు జిల్లాలో ఒక్క కాకాణి గోవర్థన్ రెడ్డి వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. అంతే తప్పించి అనిల్ కుమార్ యాదవ్ కనిపించడం లేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి జాడలేదు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితా పయితా లేరు. మేకపాటి అడ్రస్ దొరకడం కూడా కష్టంగా మారింది. నేదురుమిల్లి కుటుంబ సభ్యులు కూడా కానరావడం లేదు. ఇలా వైసీపీకి నెల్లూరు నేతలు పెద్ద షాక్ ఇచ్చినట్లే కనపడుతుంది. నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలున్నప్పటికీ దాని ప్రభావం మరికొన్ని జిల్లాలపై పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సింహపురిని తిరిగి సొంతం చేసుకోవాలంటే జగన్ నేరుగా రంగంలోకి దిగి నేతలకు తగిన హామీలు ఇచ్చి తీరాల్సిందే. లేకుంటే వారు ఎన్నికల నాటి వరకూ బయటకు వచ్చే అవకాశం కనిపించదు. అటూ ఇటు అయితే వారు పార్టీలు మారినా ఆశ్చర్యం పోవాల్సిన పనిలేదు. సో..నెల్లూరు జిల్లాాలో పార్టీ ప్రక్షాళనకు జగన్ ఇప్పటికైనా శ్రీకారం చుడతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.