Ap Poliitcs : ఆ అపోహలొద్దు భయ్యా...ఏదీ శాశ్వతం కాదు.. ముప్ఫయేళ్లు తానే అనుకున్న జగన్ కు?
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరికైనా సరే. అపజయం కన్నా కొన్ని సార్లు విజయమే ప్రమాదకరంగా మారుతుంది
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరైనా సరే.. అపజయం కన్నా కొన్ని సార్లు విజయమే ప్రమాదకరంగా మారుతుంది. అహం పెరగకుండా ఉంటే రక్షిస్తుంది. పెరిగితే భక్షిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగకూడదు. అలా అనుకునే మొన్నటి వరకూ అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. ఈ ఎన్నికలలో జనం ఊహించని విధంగా తీర్పు చెప్పారు. ఎవరి అంచనాలకు అందని విధంగా తన జడ్జిమెంట్ ను చెప్పకనే చెప్పేశారు. అయితే ఇందులో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఉన్న ఆదరణకు మించి ప్రస్తుత ప్రతిపక్షంపైన ఉన్న వ్యతిరేకత వల్లనే ఇంతటి విజయం అని తెలుసుకోవాలి.
జగన్ పార్టీ కూడా...
నాడు తనకు 151 స్థానాలు వచ్చాయని మొన్నటి వరకూ జగన్ మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్ లో చెప్పేవారు. ఈసారి వైనాట్ 175 అంటూ నినాదాన్ని కూడా అందుకున్నారు. అంతేకాదు ముప్పయి ఏళ్లు మనదే అధికారమని 2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు కూడా వ్యాఖ్యానించారు. అంటే ముప్పయి ఏళ్ల పాటు జగన్ పార్టీకి తిరుగులేదనుకున్నారు. ఇక చేస్తున్న సంక్షేమ పథకాలు, అమలు చేసిన వాగ్దానాలు, మ్యానిఫేస్టో వంటి అంశాలతో తమ వైపే జనం చూస్తారని ఫ్యాన్ పార్టీ నేతలు గిరగిరా తిరుగుతూ చెప్పేవారు. వాస్తవాలు తెలియని క్యాడర్ నిజమని తెలియక రెచ్చిపోయారు. ఫలితం ఎవరూ చెప్పనక్కరలేకుండా చూశాం. ఈసారి కూటమికి 164 స్థానాలు కట్టబెట్టారు. అంటే 151 స్థానాలు వచ్చిన జగన్ పార్టీకి పదకొండు స్థానాలకే పరిమితం చేశారు.
కూటమి పార్టీ నేతలకు...
అయితే ఇది ఒక్క జగన్ కు మాత్రమే కాదు.. అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు కూడా వర్తిస్తుంది. గెలిచినందుకు సంబరాలు చేసుకోవచ్చు. తప్పు కాదు. అంబరాన్ని అంటేలా తమ పార్టీ నినాదాలను చేయవచ్చు. అభ్యంతరం లేదు. కానీ ఇక జగన్ పని ముగిసిపోయినట్లేనని భావించి వీళ్లు కూడా విర్ర వీగితే 2029 ఎన్నికల నాటికి ఇబ్బందులు తప్పవు. జనం చూస్తూ ఉంటారు అంతే. ఐదేళ్లు ఏం చేసినా భరిస్తారు. కానీ మాట్లాడరు. కానీ సమయం వచ్చినప్పుడు బటన్ నొక్కి మరీ తమ అభిప్రాయాన్ని బలంగా చెబుతారు. ఇప్పుడు టీడీపీలో కొందరు నేతల వ్యవహార శైలి చూస్తుంటే అధికారం తమకు శాశ్వతమని భావిస్తున్నట్లుంది. అయితే ఎవరికీ శాశ్వతం కాదు. అలా అనుకోవడం కేవలం భ్రమ. ఇది తెలుసుకుంటే చాలు. జగన్ పని అయిందని చంకలు గుద్దుకుని ఏదో చేయాలనుకుంటే అది బూమ్‌రాంగ్ కాక తప్పదు.
కేసీఆర్ కూడా...
జగన్ పార్టీ కూడా ఐదేళ్ల పాటు ఇలాగే విర్రవీగితే జనం కర్రు కాల్చి వాతపెట్టిన విషయం టీడీపీ నేతలు కూడాగుర్తుంచుకోవాలి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ రాష్ట్రాన్ని తెచ్చిన తనకు ఎదురేలేదునుకున్నారు కేసీఆర్. తిరుగులేదని ఇష్టారీతిన నిర్ణయాలు చేశారు. ప్రజలు పదేళ్ల పాటు పంటి బిగువున భరించారు. చాచి కొడితే ఇప్పుడు ఎక్కడున్నారన్నది అందరికీ తెలిసిందే. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయడం, ప్రజల మనసులను గెలుచుకోవడం పై ఫోకస్ పెడితే మళ్లీ విజయానికి మాత్రం ఢోకా ఉండదు. జగన్ చావలేదు..చచ్చేంత వరకూ కొట్టాలి అన్న కామెంట్స్ పార్టీకి నష్టం చేకూరుస్తాయి తప్పించి అదనంగా ఏమాత్రం లాభం చేకూర్చవు. వీలయితే చంద్రబాబుకు నేతలు అండగా నిలిచి ఆయన చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ముందుకు సాగాలి. తమ్ముళ్లూ.. అది చేయండి చాలు.