YSRCP : జేసీబీల శబ్దంతో దడ... ఎప్పుడు ఏది కూలుస్తారోనన్న టెెన్షన్.. ఆక్రమిస్తే అంతేగా.. అంతేగా..!

వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయాలకు వరస నోటీసులు అందుతున్నాయి. బుల్డోజర్లు సిద్ధమవుతున్నాయి

Update: 2024-06-23 06:41 GMT

వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయాలకు వరస నోటీసులు అందుతున్నాయి. ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇక జిల్లాల్లో కూడా అధికారులు వరసగా నోటీసులు పంపుతున్నారు. గత ఐదేళ్లలో అన్ని జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలను నిర్మించాలని నాయకత్వం నిర్ణయించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించింది. ఒక్కొక్కటి రెండు ఎకరాలకు పైగానే స్థలాల్లో వీటిని నిర్మించాలని అప్పట్లో నాయకత్వం ఆదేశించడంతో జిల్లా నేతలు పోటీ పడి మరీ పార్టీ కార్యాలయాలను నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే అనేక చోట్ల మున్సిపల్ అనుమతులు లేకుండానే నిర్మాణాలు మొదలుపెట్టారన్న ఆరోపణలున్నాయి.

రెండుసార్లు నోటీసులు...
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా తొలుత ఈ నెల 5వ తేదీన నోటీసులు ఇచ్చామని, ఇరిగేషన్ శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించి ఎలా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తారని నోటీసులు అందించారు. మరోసారి పదో తేదీన కూడా నోటీసులు ఇచ్చామని, అయినా వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కూల్చేసినట్లు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన ప్రభుత్వమే ఆక్రమణలు చేస్తే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమంగా నిర్మించే నిర్మాణాలను కూల్చివేసే ప్రభుత్వం తానే అతిక్రమిస్తే అది సబబు ఎలా అవుతుందన్న ప్రశ్నకు వైసీపీ నేతల నుంచి సమాధానాలు మాత్రం లేవు.
లీజుకు తీసుకున్నామని...
తాము ఇరిగేషన్ స్థలాన్ని 33 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నామని వైసీపీ నేతలు చెబుతున్నా, తాడేపల్లిలో అంత పెద్ద భవనం నిర్మించడానికి అవసరమైన అనుమతులు కూడా తీసుకోకుండా నిర్మాణం చేపట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క తాడేపల్లి మాత్రమే కాదు అనేక జిల్లా కేంద్రాల్లో ఎవరి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేయడం పై ప్రజలు సయితం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్యాలెస్ లను తలపించేలా పార్టీ కార్యాలయాలను నిర్మించడం కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి కారణంగా చెబుతున్నారు. పార్టీ జిల్లా కార్యాలయాలకు అంతేసి భవనాలు అవసరమా? అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అధికారులు కూడా సరైన అనుమతులు లేవని వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
అన్ని జిల్లాల్లో...
విశాఖ, అనకాపల్లిలో నిర్మిస్తున్న పార్టీ భవనాలకు సంబంధించి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో సమాధానాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక కర్నూలు, అనంతపురం, తాజాగా రాజమండ్రిలో నిర్మిస్తున్న భవనాలకు కూడా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లో భవనాన్ని తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులన్నీ జిల్లా పార్టీ అధ్యక్షులకు పంపడంతో వివరణ ఇచ్చేందుకు వాళ్ల వద్ద కూడా మ్యాటర్ లేకపోవడంతో కొందరు మౌనంగానే ఉంటున్నారు. మరికొందరు మాత్రం న్యాయస్థానాలను ఆశ్రయించాలని నిర్ణయించారు. మొత్తం మీద వైసీపీ పార్టీకార్యాలయంపై ఇప్పుడు బుల్డోజర్ లు కదులుతున్నాయి. జేసీబీలు కూడా సిద్ధమవుతున్నాయి. మొత్తం మీద నాడు అధికారంలో ఉన్నప్పుడు అతి విశ్వాసంతో ఆక్రమించిన భూములు, అనుమతులు లేని నిర్మాణాలు చేపట్టడంతోనే అధికారులు కూల్చి వేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిజమే.. ఆక్రమణలు, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరిపైనా చర్యలు తీసుకోవాల్సిందే కదా?



Tags:    

Similar News