YSRCP : వైసీపీ నుంచి కాపులందరూ క్విట్ అవుతారా? సంకేతాలు కనిపిస్తున్నాయిగా?
వైసీపీ పై కాపుల్లో వ్యతిరేకతను గమనించి నేతలు ముందుగానే తప్పుకుంటున్నారు. పార్టీని వీడుతున్నారు.
వైసీపీ పై కాపుల్లో వ్యతిరేకతను గమనించి నేతలు ముందుగానే తప్పుకుంటున్నారు. ఇప్పటికే పార్టీని వీడిన నేతలందరూ దాదాపుగా అందరూ కాపులే కావడంతో పార్టీలో ఈ రకమైన చర్చ జరుగుతుంది. తమ రాజకీయ భవిష్యత్ కోసం మాత్రమే కాకుండా సొంత సామాజికవర్గంలో పట్టును, పరువును నిలుపుకునేందుకు కాపు సామాజికవర్గం లీడర్లు జగన్ కు చేయి ఇస్తున్నారు. రానున్న కాలంలో కాపు సామాజికవర్గం వైసీపీ వైపు ఉండే అవకాశం లేదని భావించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో ఉన్న వైసీపీ కాపు సమాజికవర్గం నేతలు జగన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
పిఠాపురం నేత...
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కాపు సామాజికవర్గం నేత. అయితే ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. అయితే ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీతో ప్రారంభమయింది. అయినా పెండెం దొరబాబు 2004 ఎన్నికల్లో బీజీపీ నుంచి పోటీ చేశారు. గెలుపొందారు. వైెఎస్ పైఅభిమానంతో కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మరణం తర్వాత ఆయన వైసీపీలో చేరారు. దీంతో పెండెం దొరబాబుకు వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో పిఠాపురం టిక్కెట్ ను ఇచ్చారు. దీంతో వైసీపీ నుంచి ఆయన విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మాత్రం ఆయనకు టిక్కెట్ వైసీపీ నుంచి లభించలేదు. దీంతో ఆయన వైసీపీ అభ్యర్థి వంగా గీతకు అసంతృప్తితోనే సపోర్టు చేశారు. వైసీపీ ఓటమి తర్వాత ఆయన జనసేనలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ ఇద్దరు కూడా...
ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని కూడా కాపు నేతే. ఆయన వైఎస్ జగన్ కు నమ్మిన బంటు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి పదవిని చేట్టారు. ఆయన ఏలూరు నుంచి ఓటమి పాలయినా వైసీపీ తరుపు ఎమ్మెల్సీగా జగన్ చేశారు. అయితే ఆయన ఏపార్టీలో చేరకుండా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెంది. కిలారి రోశయ్య కూడా పార్టని వదిలి పెట్టారు. ఆయన కూడా కాపు సామాజికవర్గం నేతే. ఆయన 2019 ఎన్నికల్లో పొన్నూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కిలారు రోశయ్య వైసీపీలో ఉన్న అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఆయన కూడా త్వరలోనే జనసేనలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇక
బ్రాండ్ అంబాసిడర్ గా....
ఇలా ముగ్గురు కీలక నేతలు కాపు సామాజికవర్గం నేతలే కావడంతో మిగిలిన కాపులు కూడా వైసీపీ నుంచి వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతుంది.పవన్ కల్యాణ్ కాపులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో ఇక వైసీపీలో ఉండి చేసేదేమీ లేదని నేతలు డిసైడ్ అయినట్లున్నారు. జనసేనలో ఉండి తమకు ఫ్యూచర్ ఉంటుందని వారు నమ్ముతున్నారు. ముద్రగడ పద్మనాభం వంటి వారి మాట కూడా చెల్లుబాటు కాకపోవడం, ఇక పవన్ కల్యాణ్ కాపులకు నేతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వీరి బాటలోనే మరికొందరు కాపు సామాజికవర్గం నేతలు కూడా వైసీపీని వీడి జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వీరందరినీ జనసేన నేత పవన్ కల్యాణ్ పార్టీలో చేర్చుకుంటారా? లేదా? అన్నది మాత్రం తేలలేదు.