Tirumala : తిరుమలలో భక్తులు సాధారణం.. దర్శనం సులభం

తిరుమలో ఈరోజు భక్తుల రాక తగ్గింది. ఆదివారం అయినా భక్తులు ఎక్కువగా లేరు.

Update: 2024-10-20 03:06 GMT

తిరుమలో ఈరోజు భక్తుల రాక తగ్గింది. ఆదివారం అయినా భక్తులు ఎక్కువగా లేరు. దసరా సెలవులు ముగియడంతో పాటు భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు తక్కువగా వస్తున్నారు. సాధారణంగా శని, ఆదివారాలు తిరుమల వీధులన్నీ కిక్కిరిసి పోతుంటాయి. కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్లుగా ఉంటాయి. అలాంటిది ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఈరోజు సులువుగా మారింది. ఆదివారం కావడంతో ఈరోజు తిరుపతికి చెందిన స్థానికులు ఎక్కువ మంది శ్రీవారిని దర్శించుకునే వీలుంది. మరోవైపు ఆన్‌లైన్‌లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల అయ్యాయి. లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు జరగనుంది. రేపు ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఐదు కంపార్ట్‌మెంట్లలోనే...
ఇదిలా ఉండగా తిరుమల బ్రేక్ దర్శనాలు వారానికి ఆరు రోజులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు రోజుకి ఒక లెటర్ పై విఐపి బ్రేక్ దర్శనం ఇస్తున్నారు. ఈ స్థానంలో రెండో లెటర్ ని కూడా అనుమతించాలని ముఖ్యమంత్రిని కోరడంతో ఆయన అందుకు సమ్మతించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఐదు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం నేడు ఐదు నుంచి ఆరు గంటల సమయం మాత్రమే పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,741 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News