పోలవరం గేట్లను తెరవండి : PPAకు తెలంగాణ విజ్ఞప్తి
2022 జులైలో కూడా గోదావరికి వరద పోటెత్తగా.. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ముంపునకు గురైందని ఆయన ఈ లేఖలో..
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. ఇప్పటికే నది నీటి మట్టం 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. భద్రాచలం ముంపుకు గురికాకుండా ఉండాలంటే.. పోలవరం గేట్లన్నింటినీ తెరిచి.. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(PPA)ని తెలంగాణ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్ సీ మురళీధర్ PPAకు లేఖ రాశారు.
2022 జులైలో కూడా గోదావరికి వరద పోటెత్తగా.. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ముంపునకు గురైందని ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునేంత వరకూ.. వాటర్ ఇయర్ లో గేట్లన్నీ తెరిచి వరదను దిగువకు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణతో పాటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రెండురోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయమవ్వగా.. అతిభారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేటి అర్థరాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దాని ప్రభావంతో ఏపీలో మూడు, తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు పడనున్నట్లు తెలిపింది.