కాకినాడ ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి
ఈ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయిల్, గ్యాస్ పరిశ్రమలలో..;
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని జి.రాగంపేటలో ఉన్న అంబటి ఆయిల్స్ లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి చెందారు. ట్యాంక్ శుభ్రం చేస్తుండగా.. ఏడుగురు కార్మికులు ఊపిరాడక చనిపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎల్జీపాలిమర్స్ దుర్ఘటనను పవన్ గుర్తు చేసుకున్నారు. ఎల్జీ పాలిమర్స్ మృతులకు చెల్లించినట్లే.. ఈ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయిల్, గ్యాస్ పరిశ్రమలలో వరుస ప్రమాదాలు జరుగుతూ పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదన్నారు. కాగా.. గురువారం అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా తీవ్ర రసాయనాలు వెలువడటంతో ఊపిరాడక ఏడుగురు కార్మికులు మృతిచెందారు.