Gorantla Madhav : మరోసారి విచారణకు రావాల్సి ఉంటుంది
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను విచారించిన పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించి వేశారు;

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను విచారించిన పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించి వేశారు. పోక్సో కేసులో బాధితురాలి పేరును బహిరంగంగా వ్యక్త పర్చారంటూ మాజీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు హాజరు కావాలని ఈ నెల 2న పోలీసులు గోరంట్ల మాధవ్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
గంట సేపు ప్రశ్నించి...
దాదాపు గంట సేపు ఆయనను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించారు. అనంతరం నోటీసులు ఇచ్చి పంపారు. తాను ఆ కేసులో ఎవరి పేరు బయటపెట్టలేదని, ఆ గొంతు తనకు కాదని, ఆ వీడియోను ఒకసారి తనకు చూపించాలని కూడా గోరంట్ల మాధవ్ పోలీసులను కోరినట్లు తెలిసింది. తాము ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. గోరంట్ల మాధవ్ తో పాటు ఆయన తనరుపున న్యాయవాది కూడా విచారణకు హాజరయ్యారు.