Purandhreswari : అంకెలు భయపెట్టే సమయంలో బీజేపీ నేతలు ఆ సాహసం చేస్తారా?

లోక్‌సభ స్పీకర్ గా పురంద్రీశ్వరి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇది సాధ్యమయ్యే అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి

Update: 2024-06-10 05:35 GMT

లోక్‌సభ స్పీకర్ గా పురంద్రీశ్వరి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇది సాధ్యమయ్యే అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. సాధారణ పరిస్థితుల్లో అయితే పురంద్రీశ్వరిని స్పీకర్ గా ఎన్నిక చేసేవారు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుత్లో ఆమె పేరు పరిశీలనలోకి రావడం కూడా కష్టమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం. గతంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో బాలయోగి లోక్‌సభ స్పీకర్ గా పనిచేశారు. తర్వాత ఆ స్థానం ఎవరికీ దక్కలేదు. ఇటు యూపీఏ ప్రభుత్వ హయాంలో గాని, అటు ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోని పదేళ్లలో ఆ అవకాశం మాత్రం తెలుగు రాష్ట్రాలకు లభించలేదు.

అలా తప్పిపోయి...
సాధారణంగా పురంద్రీశ్వరి పేరు మంత్రివర్గంలో తీసుకుంటారని బాగా వినిపించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండటంతో పాటు ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెను మోదీ కేబినెట్ లోకి తీసుకుంటారని భావించారు. కానీ టీడీపీ కమ్మ సామాజికవర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ పేరును కేంద్రమంత్రిగా ప్రతిపాదన పంపడంతో అదే సామాజికవర్గం నుంచి ఎంపిక చేస్తే సామాజిక సమతుల్యం సాధ్యం కాదని భావించి మోదీ చివరి నిమిషంలో నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ పేరును తీసుకు వచ్చారు. ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు గెలవగా అందులో శ్రీనివాస వర్మకే కేంద్ర మంత్రి పదవి లభించింది. అనకాపల్లి నుంచి గెలిచిన సీఎం రమేష్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చినా ఆయనకు కూడా ఇవ్వలేదు.
ఆధారపడి ఉండటంతో...
అయితే పురంద్రీశ్వరికి లోక్‌సభ స్పీకర్ గా ఎంపిక చేస్తారనన ప్రచారమయితే జాతీయ, స్థానిక మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. కానీ అది సాధ్యపడే అవకాశాలు తక్కువ అంటున్నారు. ఇప్పుడు బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కన్నా తక్కువ స్థానాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. రానున్న కాలంలో పరిస్థితులు ఎటు పోయి ఎటు వస్తాయో తెలియదు. ఇతర పార్టీల నుంచి ఎంపీలను బీజేపీలోకి తీసుకున్నా, బీజేపీ నుంచి ఇతర పార్టీలకు వెళ్లాలన్నా స్పీకర్ చర్యలు ఉంటాయన్నది వాస్తవం. స్పీకర్ కీలకంగా వ్యవహరిస్తారు. అందుకే తమకు నమ్మకమైన నేతకు బీజేపీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. బీజేపీ పాలనలో ఉన్న పదేళ్ల కాలంలో ఫస్ట్ టైం సుమిత్రా మహాజన్ ను ఎంపిక చేయగా, రెండో దఫా ఓంబిర్లాను సెలెక్ట్ చేశారు. ఇద్దరు నేతలు బీజేపీకి అత్యంత విశ్వాసమైన వారు. నార్త్ ఇండియా లాబీయింగ్ ఈ పదవి విషయంలో బలంగా పనిచేస్తుందనే చెప్పాలి.
నార్త్ ఇండియా లాబీ...
పైగా ఇద్దరూ నార్త్ ఇండియాకు చెందిన వారే. అంకెలు ఇబ్బంది పెట్టే సమయంలో బీజేపీ నాయకత్వం పురంద్రీశ్వరికి స్పీకర్ పదవి ఇచ్చి సాహసం చేస్తుందని అనుకోవడం లేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం. ఎందుకంటే.. స్పీకర్ అయినా తాము చెప్పినట్లు నడిచే వాళ్లుండారు కానీ వేరే పార్టీల ప్రభావం ఉండని, మిత్రపక్షాలకుచెందిన వారి ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉండకూడదని సహజంగా భావిస్తారు. పురంద్రీశ్వరి బీజేపీ అయినప్పటికీ, ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో దగ్గర బంధుత్వం ఉండటం ఆమెను స్పీకర్ గా ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణమని సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అందులో వాస్తవం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్ధవ్ థాక్రే శివసేన కూడా స్పీకర్ పదవిని టీడీపీ తీసుకోవాలని కోరింది. అందుకే పురంద్రీశ్వరి విషయంలో పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో పురంద్రీశ్వరి లాంటి వారికి స్పీకర్ పదవి ఇచ్చి దినదినగండంగా మారే అవకాశాలయితే లేవు. అయితే తదుపరి విస్తరణలో పురంద్రీశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు మాత్రం కొట్టిపారేయలేం. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Tags:    

Similar News