అతి భారీ వర్షాలు.. అలర్ట్ గా ఉందాం

త్వరలో అతి భారీ వర్షాలు కురవబోతూ ఉన్నాయి. అందుకు కారణం

Update: 2023-11-29 09:57 GMT

త్వరలో అతి భారీ వర్షాలు కురవబోతూ ఉన్నాయి. అందుకు కారణం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడమే.. ఈ విషయాన్ని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ధృవీకరించింది. అల్పపీడనం నవంబరు 30 నాటికి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. డిసెంబరు 2 కల్లా నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తుపానుగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబరు 3న రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ మేరకు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ఠంగా 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. కోస్తాంధ్రలో డిసెంబరు 2 నుంచి 4 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబరు 30 కల్లా తిరిగొచ్చేయాలని ఐఎండీ హెచ్చరించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తేలిక నుంచి మోస్తరు పాటి వర్షాలు కురిసే ఛాన్సు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని కొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈరోజు, రేపు కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News