Breaking: టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికల అక్రమాలను ఛేదించిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.!

పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారా?

Update: 2024-01-26 14:47 GMT

నోవా గ్రూప్‌ చైర్మన్‌, పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గత ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (APSDRI) ఆరోపించారు. నోవా అగ్రి టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌ ద్వారా అక్రమ ధన ప్రవాహం, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించాయి రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు. ఓటర్లకు డబ్బులు పంచారని ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి బాపట్ల జిల్లా పోలీసులు ఆదాయపన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెబీ వర్గాలను అప్రమత్తం చేశాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి సాక్ష్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నోవా అగ్రి టెక్ ప్రాగంణంలో జనవరి 24న సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా ఓ డైరీ లభించింది. అందులో 2019 ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బుల్చిన వివరాలు ఉన్నాయని తెలుస్తోంది.

సెర్చ్ ఆపరేషన్ లో 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు ఇచ్చిన సమాచారాన్ని తెలియజేస్తూ.. డైరీలో చేతి రాతతో చేసిన చాలా సమాచారాన్ని కనుగొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తేదీ అంటే 11.04.2019కి ముందు ఓటర్లకు డబ్బు పంపిణీ కోసం జరిగిన నగదు ప్రవాహం గురించి డైరీలో రాశారు. డైరీలోని 13 పేజీలలో కీలక సమాచారాన్ని రాశారు. నోవా అగ్రి టెక్ ప్రైవేట్. లిమిటెడ్ కంపెనీ నుండి పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగి పుల్లెల అజయ్ బాబు కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. డైరీలోని రాసిన సమాచారం గురించి వివరించమని కోరినప్పటి నుండి అజయ్ బాబు పరారీలో ఉన్నారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది.
గ్రామాల తేదీలు, పేర్లు, బూత్‌ల వారీగా నమోదైన ఓట్లు, బయటి ఓటర్లకు రవాణా ఛార్జీలు తదితర వివరాలను అందులో రాశారు. అక్రమంగా నల్లధనాన్ని ఓటర్లకు ఇవ్వడానికి వినియోగించినట్లు ప్రాథమికంగా తేలింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అక్రమ మార్గాలను ఆశ్రయించడం ద్వారా లబ్ధి పొందారని తెలుస్తోంది. ఈ ఖర్చును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లలేదు. పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివన్‌రావు తరపున నోవా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు, కీలక వ్యక్తులు అక్రమ లావాదేవీలు జరిపారు. ఏలూరి సాంబశివరావు 2014తోపాటు 2019లోనూ పర్చూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో గొట్టిపాటి భరత్ కుమార్‌పై 10 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించిన ఆయన.. 2019 ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై 1647 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. నోవా గ్రూప్‌లో దొరికిన డైరీలో.. దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం గ్రామాల్లో డబ్బు పంపిణీకి సంబంధించిన వివరాలు ఉన్నాయి.
బాపట్ల జిల్లా పోలీసులకు అందుకు సంబంధించిన సమాచారం పంపారు. అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఆదాయపు పన్ను అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపారు. నోవా గ్రూప్ కంపెనీల నుండి డబ్బు పంపిన కొన్ని బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తూ ఉన్నారు.


Tags:    

Similar News