Rk Roja : రోజా ఇక రాజకీయాలు వదిలేసినట్లేనా? పాలిటిక్స్ కు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయ్యారా?

ఆర్కే రోజా వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేత. రెండు సార్లు వరసగా గెలిచి ఎమ్మెల్యేగా రోజా ఇక నగరిలో తనకు తిరుగు లేదనుకున్నారు.

Update: 2024-08-13 11:43 GMT

ఆర్కే రోజా వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేత. 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచి ఎమ్మెల్యేగా రోజా ఇక నగరిలో తనకు తిరుగులేదనుకున్నారు. ప్రత్యర్థులను కూడా తక్కువ అంచనా వేశారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు చనిపోవడం, ఆయన కుటుంబంలో విభేదాలు తలెత్తడంతో నగరి నియోజకవర్గంలో తనకు ఎదురు లేదనుకున్నారు. అతి విశ్వాసంతో ఆమె ముందుకు వెళ్లారు. దీంతో సొంత పార్టీనేతలను కేర్ చేయలేదు. దీంతో వైసీపీలోనే రోజా శత్రువులను తయారు చేసుకున్నారు. తనకున్న వాయిస్ తో అధిష్టానం వద్ద కొట్లాడి మరీ ఆర్కే రోజా మూడోసారి కూడా టిక్కెట్ తెచ్చుకోగలిగారు.

ఎవరినీ లెక్క చేయకుండా...
నగరి నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి తిరుగులేనిది. అక్కడ తమిళ మూల ఓటర్లు ఎక్కువగా ఉండటం కూడా ఆర్కే రోజాకు కలసి వచ్చిందంటారు. తన భర్త సెల్వమణి తమిళుడు కావడంతో ఒక రకంగా ఆ ఓట్లన్నీ ఇక గంపగుత్తగా తనకు పడతాయని భావించారు. ఇక జగన్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు తనను మూడో సారి గట్టెక్కిస్తాయని భావించారు. అందుకే డోన్ట్ కేర్ అంటూ ఎవరినీ లెక్క చేయకుండా తనకు సెల్యూట్ చేసే వారికే పదవులు కట్టబెట్టారు. అలాగే అధినాయకత్వం పార్టీలోని తన ప్రత్యర్థులకు పదవులు ఇవ్వడాన్ని కూడా జీర్ణించుకోలేక కొంత అసహనం వ్యక్తం చేసిన రోజులు కూడా లేకపోలేదు.
మంత్రి పదవి ఇచ్చి...
వైఎస్ జగన్ ఆర్కే రోజాకు ఏం తక్కువ చేయలేదు. చిత్తూరు జిల్లాలో సామాజికవర్గాలను పక్కన పెట్టి మరీ, సీనియర్ నేత అయిన భూమన వంటి వారిని కాదనుకుని ఆర్కే రోజాకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆర్కే రోజా ఇక చెలరేగిపోయారనే చెప్పుకోవాలి. తన సోదరుడు నగరి నియోజకవర్గంలో ప్రమేయంపై ఆమె రాజకీయ విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే వాటన్నింటికి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఇది ప్రత్యర్థుల కుట్ర అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆర్కే రోజా దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక రాష్ట్రంలో వైసీపీ కూడా కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయింది.
గతంలో మాదిరిగా...
దీంతో ఆర్కే రోజా నగరిని వదిలేసి చెన్నైకు ఆమె మకాం మార్చేశారని తెలిసింది. నగరిలోని ఆమె ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన కార్యకర్తలు వెనుదిరిగి వెళుతున్నారు. రోజా మాత్రం ఈ మధ్య యూరప్ లో పర్యటించి సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి. 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నా ఆర్కే రోజా తన వాయిస్ తో ప్రజల్లో తిరిగే వారు పార్టీకి అనుకూలంగా పనిచేసేవారు. కానీ ఈ ఎన్నికల తర్వాత మాత్రం పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్లారని తెలిసింది. అందుకే ఆర్కే రోజా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందించకుండా వేరే రాష్ట్రంలోనో, దేశంలోనో పర్యటిస్తూ కాలం గడుపుతున్నారు. దీంతో నగరి క్యాడర్ మాత్రం తమకు కొత్త నేతనైనా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారట.


Tags:    

Similar News