Tirumala : తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. ఈరోజు దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు;

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. వరస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉగాది, రంజాన్ తో పాటు వరస సెలవులతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలలో బారులు తీరారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఏడుకొండల వాడిని దర్శించుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.
వరస సెలవులతో పాటు...
వరస సెలవులతో పాటు ఈ నెలలో పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటం కూడా తిరుమలలో భక్తులు రద్దీ పెరగడానికి ఒక కారణమని చెబుతున్నారు. అందుకే ఎక్కడ చూసినా భక్తులతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. తలనీలాలను సమర్పించే కేంద్రాలు కూడా రద్దీగా ఉన్నాయి. ఇక లడ్డూ కేంద్రాల వద్ద కూడా అధిక శాతం మంది భక్తులు ఉండటంతో క్యూ కౌంటర్లను పెంచాల్సి వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అలాగే అన్నదానం సత్రం వద్ద కూడా అదే రద్దీ కొనసాగుతుంది.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,263 మంది భక్తులు దర్శింకున్నారు. వీరిలో 25,733 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.