Tirumala : తిరుమలలో మళ్లీ పెరిగిన రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2024-09-27 03:04 GMT

tirumala darshan

తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మూడు రోజుల నుంచి ఖాళీగా ఉన్న తిరుమల వీధులన్నీ ఇప్పుడు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సహజంగా శుక్ర, శని, ఆదివారాలు స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగానే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని రకాలుగా భక్తులకు సౌకర్యం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచి దసరాలో జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశమున్నందున దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం వరకూ భక్తుల రద్దీ కొనసాగే అవకాశముండటంతో అన్నదానంతో పాటు లడ్డూల తయారీ కూడా ఎక్కువగా తయారు చేయడానికి దేవస్థానం అధికారులు సిద్ధమయ్యారు.

17 కంపార్ట్‌‌మెంట్లలో...
తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి ముందుగా అంచనా వేసిన అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు వరస పార్టీ నేతల పర్యటనలు కూడా ఉండటంతో వాటికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదిహేడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్‌లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లున్న భక్తులు ఐదు గంటలలో దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 61,328 మంది దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 22,033 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.84 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News