Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది.

Update: 2024-12-08 03:05 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. శనివారం భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో ఆదివారం కూడా భక్తులు అంతగా రారని టీటీడీ అధికారులు భావించారు. అయితే అధికారుల అంచనాలకు భిన్నంగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. ఆదివారం కావడంతో పాటు చుట్టు పక్కల జిల్లాలకు చెందిన వారు అత్యధికంగా వచ్చారని భావిస్తున్నారు. అదే సమయంలో పొరుగున ఉన్న తమిళనాడుకు చెందిన భక్తులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం సౌకర్యం ఉన్నప్పటికీ వారికి కూడా ఆలస్యమవుతుంది. ఇక మాడ వీధులన్నీ భక్తుల గోవింద నామస్మరణతో మారు మోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. అన్న ప్రసాదం క్యాంటిన్ వద్ద, లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద కూడా రష్ అధికంగా ఉండటంతో అధికారులు ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. తిరుమలకు రద్దీ పెరగడంతో అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

పదమూడు గంటల పాటు...
తిరుమలకు సహజంగా శని, ఆదివారాలు భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ, నిన్న తక్కువగా కనిపించడంతో ఆదివారం కూడా భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుందని భావించారు. మరోవైపు వాతావరణ శాఖ మరో అల్పపీడనం అని చేసిన హెచ్చరికల వల్ల కూడా భక్తుల రద్దీ తగ్గుతుందని అంచనా వేశారు. కానీ అందుకు వ్యతిరేకంగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదమూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసినభక్తులకు రెండు నుంచి మూడు గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,569 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,193 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News