వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వేతనాలు పెంచుతూ నిర్ణయం

Update: 2022-10-22 02:03 GMT

జూనియర్‌ డాక్టర్లు సమ్మె నోటీసులకు ప్రభుత్వం స్పందించింది. వేతనాలు పెంచేందుకు ఒప్పుకుంది. ఐదు విభాగాల్లో జూనియర్‌ వైద్యుల వేతనాలు పెంచుతూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలకు అదనంగా మరో 15 శాతం పెంచాలంటూ డీఎంఈ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. పెంచిన వేతనాలు ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి రానున్నాయి.

తమకు చెల్లించే స్టైఫండ్ ను 42 శాతం పెంచాల్సిందేనని.. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేదంటే ఈ నెల 26 నుంచి ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరిస్తామని అంతకు ముందు జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 26 తేదీ నుంచి ఓపీ విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. 27వ తేదీ నుంచి అత్యవసర సేవలు తప్ప మిగతా వైద్య సేవలన్నీ బహిష్కరిస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ వైద్యులు నిర్వహించిన ఆందోళనకు ప్రభుత్వ స్పందించిందని, ఇప్పుడు ఇస్తున్న స్టయిపెండ్‌కు అదనంగా 15శాతం పెంచుతున్నట్లు జీవో జారీ చేసిందని ఏపీ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ జె.జస్వంత్‌ తెలిపారు. ఈ నెల 26, 27న జరగాల్సిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.


Tags:    

Similar News