అక్టోబర్ 3 కు వాయిదా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై

Update: 2023-09-27 10:43 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. క్వాష్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు పిటీషన్ దాఖలు చేశారు. క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తొలుత చంద్రబాబు పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్‌వీఎన్‌ భట్టి విముఖ వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను సిద్ధార్థ లూథ్రా సీజేఐ ముందు మళ్లీ మెన్షన్‌ చేశారు. తక్షణమే లిస్టింగ్‌ చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్‌ కోరుకుంటున్నారా? అని ఈ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు. తాము బెయిల్‌ కోరుకోవడం లేదని లూథ్రా తెలిపారు.

తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు సిద్ధార్థ్ లూథ్రా. త్వరగా లిస్ట్ చేయాలన్నదే తమ మొదటి అభ్యర్దన అని ఆయన పేర్కొన్నారు. మధ్యంతర ఉపశమనం కలిగించాలన్నది రెండో అభ్యర్ధన అని సిద్ధార్థ్ తెలిపారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమన్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న చీఫ్ జస్టిస్.. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 3 కి వాయిదా వేశారు.


Tags:    

Similar News