ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు
సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు సీజేఐ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడైన ఎర్రగంగిరెడ్డి తెలంగాణ హై కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. జులై 1న ఎర్రగంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని పేర్కొంటూ గత నెలలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి బెయిల్ పై విడుదలై.. హైకోర్టు ఆదేశాల మేరకు మే 5వ తేదీన సీబీఐ కోర్టులో లొంగిపోయారు.
ఎర్రగంగిరెడ్డిని జులై 1న విడుదల చేయాలని పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాల్ చేస్తూ.. వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు సీజేఐ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిందితుడిని మళ్లీ ఎప్పుడు విడుదల చేయాలో కూడా ముందే నిర్ణయించడంపై ప్రశ్నించింది. జులై 30వ తేదీ లోపు కేసు దర్యాప్తును పూర్తి చేయాలని, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎర్ర గంగిరెడ్డి ఉన్న జైలు సూపరింటెండెంట్ కు ఈ మేరకు నోటీసులు జారీ చేయాలని సూచించింది. బెయిల్ పై స్టే విధిస్తూ వెకేషన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా.. 2019లో ఎర్రగంగిరెడ్డికి పులివెందుల కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వగా.. ఆ బెయిల్ రద్దు కోసం సీబీఐ పలుమార్లు కోర్టును ఆశ్రయించింది. ఆ బెయిల్ ను ఏపీ హైకోర్టు సమర్థించింది. ఆ తర్వాత కేసు విచారణ తెలంగాణ హైకోర్టుకు మారింది.