రాజకీయాలంటేనే అసహ్యం వేస్తుంది
కుప్పం మున్సిపల్ ఎన్నికల తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
కుప్పం మున్సిపల్ ఎన్నికల తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కుప్పంలో దొంగ ఓట్లు అధికంగా పడుతున్నాయన్నారు. పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లు పోల్ చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకు వచ్చి దొంగ ఓట్లను వేయిస్తున్నారన్నారు. వైసీపీ తీరును చూస్తుంటే రాజకీయాలంటేనే అసహ్యం వేస్తుందని చంద్రబాబు ఆవేదన చెందారు. వైసీపీ నేతలు సిగ్గూ, శరం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ అరాచకాలను రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరారు.
ప్రజాస్వామ్యాన్ని....
దొంగ ఓట్లు పోల్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలింగ్ ఏజెంట్లను కూడా అరెస్ట్ చేశారన్నారు. ఏ ముఖ్యమంత్రీ ఇంత నీచంగా ప్రవర్తించలేదని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని చంద్రబాబు అన్నారు. ఓట్లు వేయడానికే భయపడే పరిస్థితిని తెచ్చారని చంద్రబాబు ఆవేదన చెందారు. ఎన్నికల కమిషన్ కు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని చెప్పారు.
ఫిర్యాదు చేసినా....?
అధికారులు వైసీపీతో కుమ్మక్కై మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నాయకులు ముఖంపై ఉమ్మేసినా తుడుచుకుని వెళతారని, పోలీసులు, అధికారులకైనా సిగ్గుండాలని చంద్రబాబు అన్నారు. డబ్బులు, ప్రలోభాలు, వాలంటీర్ల బెదిరింపులు, దొంగ ఓట్లు వంటి వాటితో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సహనానికైనా ఒక హద్దు ఉంటుందన్నారు. సహనం దాటితే తిరుగుబాటుకు దారితీస్తుందని చంద్రబాబు అన్నారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ప్రజలే ముందుకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు కోరారు.