Chandrababu : ఎన్డీఏలోనే కొనసాగుతాం.. ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దు

తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

Update: 2024-06-05 05:51 GMT

తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తమకు ఇలాంటి విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇది ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు. గత ఐదేళ్లుగా అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారన్నారు. కనీసం బతికేందుకు కూడా వీలులేకుండా చేశారని ఆయన ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్న చంద్రబాబు అన్నింటినీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని సేవగానే భావిస్తామని చంద్రబాబు తెలిపారు.

బాధ్యతగానే...
అధికారంలోకి వచ్చామని ఆనంద పడబోమని, ఇది ఒక బాధ్యతగా గుర్తించి ఈ రాష్ట్రాన్ని గాడిన ఎలా పెట్టాలన్న దానిపై ఫోకస్ పెడతామన్నారు. విద్యుత్తు నుంచి అన్ని వ్యవస్థలను దోచుకున్నట్లు అనుమానం ఉందన్న చంద్రబాబు వాటిని పరిశీలించాల్సి ఉందన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ప్రజలు కనెక్ట్ అయ్యారన్నారు. గత ప్రభుత్వం ఎంత మేరకు అప్పులు చేసిందో ఇంకా తెలియదని అన్నీ పరిశీలించాల్సి ఉందని చెప్పారు. తాను ఢిల్లీ బయలుదేరి వెళుతున్నానని, ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్నానని చెప్పారు. ప్రజలు ఇంతటి విస్పష్టమైన తీర్పును గతంలో ఎన్నడూ ఇవ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా...
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తాము పనిచేస్తామని తెలిపిన చంద్రబాబు ముఖ్యమంత్రి, పాలన ఎలా ఉండకూడదో జగన్ రెడ్డి చెప్పాడన్నారు. ఇది రాజకీయాల్లోనే ఒక పాఠం అని ఆయన తెలిపారు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల చేసిన కృషి కారణంగానే ఇంతటి అద్భుతమైన విజయం లభించిందన్నారు. తాను ఓడిపోయినప్పుడు కుంగిపోలేదని, అలాగే గెలిచినప్పుడు ఆనందపడబోనని తెలిపారు. తన దృష్టంతా ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో ఎలా పెట్టాలన్న దానిపైనే ఉందన్నారు. అందుకు ప్రజల సహకారం కూడా అవసరమని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లభించాయని ఆయన అన్నారు. కూటమికి ఈ ఎన్నికల్లో 55.38 శాతం ఓట్లు వచ్చాయని, అందులో టీడీపీకి 45.60 శాతం ఓట్లు వచ్చాయని, వైసీపీకి 39.37 ఓట్ల శాతం వచ్చిందని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు.


Tags:    

Similar News