మరోసారి పవన్, చంద్రబాబుల భేటీ.. సీట్ల సర్దుబాటుపై?
సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు త్వరలోనే సమావేశం కానున్నారు
సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు త్వరలోనే సమావేశం కానున్నారని తెలిసింది. ప్రస్తుతం ఇద్దరు నేతలు హైదరాబాద్‌లోనే ఉన్నారు. సీట్లు, అభ్యర్థుల ఎంపికపై ఇద్దరూ ఎవరి నివాసంలో వాళ్లు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీట్ల సర్దుబాటుపై సమావేశమైన రెండు పార్టీల నేతలు మరోసారి సమావేశం అవుతారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వీరిద్దరి భేటీ హైదరాబాద్‌లోనే జరుగుతుందని సమాచారం.
ఈ సమావేశంలోనే...
ఈ సమావేశంలోనే సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మ్యానిఫేస్టో, ఉమ్మడి సభల నిర్వహణ వంటి వాటిపై స్పష్టత వచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది. వచ్చే నెల 4వ తేదీ నుంచి చంద్రబాబు తిరిగి రా కదలి రా సభలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి అనకాపల్లి నుంచి పవన్ కల్యాణ్ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రెండో తేదీన ఎవరికెన్ని సీట్లు అన్న దానిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు స్పష్టం చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.